CM Revanth Reddy: రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడానికి స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల(Registrations) శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలు చేపట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) తెలిపారు. ఈ సంస్కరణల వల్ల ప్రజలకు ఇప్పటికే పలు మెరుగైన సేవలు అందుతున్నాయని, భవిష్యత్తులో అత్యుత్తమ సేవలు అందించడానికి వీలుగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆలోచనలకు అనుగుణంగా ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా పరిపాలన చేయనున్నట్లు తెలిపారు.
ఇబ్బంది లేకుండా అవసరమైన చోట సబ్ రిజిస్ట్రార్ (Registrations Offices) కార్యాలయాల పునర్వ్యవస్థీకరించి ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను నిర్మించబోతున్నామని వెల్లడించారు. ఈ కార్యాలయాల వల్ల పనితీరు మెరుగుపడటమే కాకుండా పర్యవేక్షణ సులభమవుతుందని అవినీతిని కూడా తగ్గించవచ్చని, కార్యాలయాల మధ్య పనిభారం సమానంగా ఉండడంతో పాటు దస్త్రాల ప్రాసెసింగ్ వేగవంతం అవుతుందన్నారు. మొదటి దశలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి నాలుగు జిల్లాల్లోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 11 సమీకృత భవనాల పరిధిలోకి తీసుకురాబోతున్నామని తెలిపారు.
సీఎం చేతుల మీదుగా..
రంగారెడ్డి(Ranga Reddy)ఆర్వో ఆఫీస్, గండిపేట, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నాలుగు ఆఫీసులను గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలిమ్) కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంగా నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. సీఎం చేతుల మీదుగా ఈ భవనానికి ఈనెల 20న శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.
ఇక అబ్దుల్లాపూర్, పెద్ద అంబర్‌పేట్, హయత్‌నగర్, వనస్ధలిపురంనకు సంబంధించి కోహెడ్‌లో, మహేశ్వరం, ఇబ్రహింపట్నం, శంషాబాద్‌కు సంబంధించి మహేశ్వరం మండలంలోని మంకాల్‌లో, ఆర్వో మేడ్చల్, కుత్బుల్లాపూర్, కీసర, శామీర్‌పేట్‌కు సంబంధించి కండ్లకోయలో ఉప్పల్, నారపల్లి, కాప్రా, ఘట్‌కేసర్, మల్కాజ్‌గిరికి సంబంధించి బోడుప్పల్‌లో, బంజారాహిల్స్, ఎస్‌ఆర్ నగర్, గొల్కోండకు సంబంధించి బంజారాహిల్స్‌లో, ఆజంపూరా, చార్మినార్, దూద్‌బౌలి సంబంధించి మలక్‌పేటలో ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను నిర్మిస్తున్నామన్నారు. మరో 13 సబ్ రిజిస్టార్ కార్యాలయాల కోసం నాలుగు చోట్ల ఇంటిగ్రేటెడ్ భవనాల కోసం స్ధలాలను గుర్తించాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.
అవినీతి రహితంగా..
ప్రజల సమయాన్ని ఆదా చేసే విధంగా పారదర్శకంగా, అవినీతి రహితంగా సేవలు అందించేలా రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తీసుకువచ్చిన స్లాట్ బుకింగ్ విధానం విజయవంతంగా అమలవుతుందన్నారు. రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏప్రిల్ 10 నుంచి దశల వారీగా జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల స్లాట్ బుకింగ్‌లు నమోదయ్యాయని తెలిపారు. స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖను తమ ప్రభుత్వం ఒక ఆదాయ వనరుగా చూడడం లేదని, ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్లాట్ బుకింగ్ ద్వారా ప్రజల సమయాన్ని ఎంతో ఆదాచేశామని, మరింత వేగవంతంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేలా ఈ- ఆధార్ విధానాన్ని తీసుకురాబోతున్నామని ఇప్పటికే ఈ విధానాన్ని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, ఖమ్మం జిల్లా కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలవుతుందని త్వరలో అన్ని కార్యాలయాల్లో అమలు చేస్తామని పొంగులేటి వివరించారు.
Also Read:Khammam Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు.. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు