CM Revanth Reddy: సోనియా గాంధీ వలనే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలబడిందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్న ప్రత్యేక రాష్ట్రం పోరాటానికి సోనియా గాంధీ చెక్ పెట్టారన్నారు. ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి తెలంగాణ ప్రజల్లో సంతోషం నిలిపారన్నారు. ఎన్ని అడ్డంకులు , ఆటంకాలు వచ్చినా తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల కలెక్టరేట్ల ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్‌గా ఆవిష్కరించారు.తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 జరుగుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా ఏర్పాటు చేసిన కార్యక్రమం నుంచి తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించారు.
9 డిసెంబర్ 2009 న తెలంగాణ ఏర్పాటు
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…ప్రజల ఆలోచనలను, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రతినిత్యం తెలంగాణ తల్లిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నామన్నారు.ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో ఒక బలమైన సంకల్పంతో నిర్ణయం తీసుకుని ఈ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టిందన్నారు.యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఆధ్వర్యంలో గత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం 9 డిసెంబర్ 2009 న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారన్నారు.నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిస్తూ తీసుకున్న ఆ నిర్ణయం ఈ ప్రాంత ప్రజలకు సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా ఆత్మగౌరవాన్ని అందించాయన్నారు.
9 తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ 9 కి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి 60 సంవత్సరాల ప్రజల బలమైన ఆకాంక్షను నెరవేర్చిన పర్వదినాన్ని తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించామన్నారు. ప్రతి ఏటా డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలను జరుపుకుంటున్నామన్నారు. గతేడాది రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయంలో ఆవిష్కరించుకుని ఒక స్ఫూర్తిని తీసుకొచ్చామని, ఈ రోజు అన్ని జిల్లా కలెక్టరేట్లలోఆవిష్కరించుకున్నామన్నారు.స్వరాష్ట్ర కల నిజమై, తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు నిటారుగా నిలబడి సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా రూపు దిద్దుకుంటున్నదన్నారు.
4కోట్ల బిడ్డల భావోద్వేగం
ఇక తెలంగాణ తల్లి అంటే ఒక భావన మాత్రమే కాదని, 4కోట్ల బిడ్డల భావోద్వేగమన్నారు. ఆ భావోద్వేగానికి నిండైన రూపం మన తెలంగాణ తల్లి అని సీఎం వివరించారు. స్వరాష్ట్ర సుదీర్ఘ పోరాట ప్రస్థానంలో సకల జనులను, సబ్బండ వర్గాలను ఐక్యం చేసి నడిపించిన శక్తి స్వరూపిణి తెలంగాణ తల్లి అంటూ వివరించారు. నాలుగు కోట్ల ప్రజల ఆలోచనను, ఆచరణను కార్యాచరణలన్నింటినీ ఒక చోటకు చేర్చి తెలంగాణ జాతి భావనకు జీవం పోసిన మాతృమూర్తి తెలంగాణ తల్లి అని వివరించారు. మనల్ని నిరంతరం చైతన్య పరుస్తూ లక్ష్యసాధన వైపు నడిపిస్తున్న గొప్ప స్ఫూర్తి మన తెలంగాణ తల్లి అని వెల్లడించారు.
Also Read: CM Revanth Reddy: ‘కేసీఆర్.. మీ కొడుకే నీకు గుది బండ’.. దేవరకొండ సభలో సీఎం రేవంత్

