‘‘రిజర్వేషన్లు పెంచడం వాటిని సహేతుకంగా పంచడం మా బాధ్యత. సభా నాయకుడిగా నేను మాట ఇస్తున్నా… ఇందిరమ్మ రాజ్యంలో మీకు అన్యాయం జరగదు. రిజర్వేషన్లను పెంచి వాటిని అమలు చేసే బాధ్యత మేం తీసుకుంటాం. బిల్లు ఆమోదానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు.’’ సీఎం రేవంత్.
SC Classification Bill: నేటి తెలంగాణ అసెంబ్లీ చరిత్రాత్మక ఘట్టానికి వేదిక అయింది. కాంగ్రెస్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఎస్సీ వర్గీకరణకు శాసనసభ ఆమోదం తెలిపింది. ప్రతిష్ఠాత్మక బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన 24 గంటల్లోనే మరో కీలక బిల్లుకు అసెంబ్లీ ఆమోదం పొందడం విశేషం.
ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా.. సీఎం రేవంత్ మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ దళితులకు అండగా ఉంటున్నదని తెలిపారు. అటు పార్టీ పరంగా, ఇటు ప్రభుత్వ పరంగా ఎస్సీలకు మంచి అవకాశాలు ఇచ్చిందన్నారు. 1960 లోనే ఉమ్మడి రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య లాంటి దళితుణ్ని ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని కొనియాడారు. దళితుడు మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడిగా పార్టీ నియమించిందని, అలాగే బాబూ జగ్జీవన్‌రామ్‌కు కేంద్రంలో కీలక బాధ్యతలు అప్పగించి గౌరవించిందని గుర్తుచేశారు.
Sunita Williams: సునీతా విలియమ్స్.. అంతరిక్ష నిద్ర ఎన్ని గంటలో తెలుసా?
ఎస్సీ, ఎస్టీ సబ్ క్లాసిఫికేషన్ కు సుప్రీం కోర్టులో సుదీర్ఘంగా కొనసాగిందని, మేం అధికారంలోకి వచ్చాక ఏడుగురు జడ్జిల ముందు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా న్యాయవాదితో సుప్రీం కోర్టులో రాష్ట్రం తరఫున వాదనలు వినిపించామని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే వర్గీకరణకు అనుకూలంగానే శాసనసభలో తీర్మానం చేశామని గుర్తు చేశారు.
సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించామని, వెనువెంటనే ఉత్తమ్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం నియమించామని చెప్పారు. న్యాయనిపుణులను సంప్రదించి జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో వన్ మ్యాన్ కమిషన్ ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వన్ మెన్ కమిషన్ ఇచ్చిన నివేదికను తూచ తప్పకుండా ఆమోదించామని, 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించి 15 శాతం రిజర్వేషన్లు వారికి పంచామని తెలిపారు.
Sunita Williams: సునీతా విలియమ్స్.. విజయం వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరు?
‘‘ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం జరిగింది. దశాబ్దాలుగా సాగిన పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. 2004లో ఉషా మెహ్రా కమిటీ వేసి సమస్య పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది’’ అని సీఎం గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ప్రభుత్వం కచ్చితంగా ఆదుకుంటుందని
వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని ప్రకటించారు.
ఇక, వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పార్టీలకతీతంగా అందరూ సమర్ధిస్తున్నారని, 2026 జనగణన పూర్తి కాగానే ఆ లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామని రేవంత్ హామీ ఇచ్చారు.
కాగా, బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసే బిల్లు , ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లును శాసనసభ ఆమోదించింది. ఈ మేరకు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లు అయింది. కులగణన విషయంలో వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ పార్టీలకతీతంగా సభ్యులందరిని ఏకతాటిపైకి వచ్చేలా సీఎం రేవంత్ కృషి చేసి బిల్లులు పాస్ అయ్యేలా చేశారు.