GPO in Revenue Village: రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసి భూ సమస్యలపై సామాన్యులకు మెరుగైన సేవలందించడానికి వీలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి జీపీవో, ప్రతి మండలానికి భూ విస్తీర్ణాన్ని బట్టి నాలుగు నుంచి ఆరుమంది వరకు లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) తెలిపారు. ఆయన రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు.
Also Read: CM Revanth Reddy: అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
ఈనెల 27వ తేదీన శిక్షణ పొందిన లైసెన్స్‌డ్ సర్వేయర్లకు తుది పరీక్ష నిర్వహిస్తామని, ఆ తర్వాత 28, 29 తేదీల్లో జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ల్యాబ్ ప్రాక్టికల్ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 12వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. తుది పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 40 రోజుల పాటు అప్రెంటిస్ శిక్షణ ఉంటుందని తెలిపారు. భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు అవసరమైన సర్వేయర్లను అందుబాటులోకి తీసుకురావలన్న లక్ష్యంతో లైసెన్స్‌డ్ సర్వేయర్లను తీసుకుంటున్నామన్నారు.
రెవెన్యూ సేవలు అందుబాటులోకి
ఇందుకోసం దరఖాస్తులను ఆహ్వానించగా 10 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో తొలివిడతలో 7వేల మందికి 33 కేంద్రాల్లో మే 26వ తేదీనుంచి శిక్షణ ప్రారంభించామని, ఈనెల 26తో 50 రోజుల శిక్షణ పూర్తవుతుందని తెలిపారు. మిగిలిన 3వేల మందికి ఆగస్టు 2వ వారం నుంచి శిక్షణ ప్రారంభిస్తామని తెలిపారు. మరోవైపు రెవెన్యూ సేవలను సామాన్యులకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంలో భాగంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీవోను నియమిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం వీఆర్వో, వీఆర్‌ఏలకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో అర్హత పరీక్ష నిర్వహించగా 3,554 మంది ఎంపికయ్యారని తెలిపారు. మరోసారి అవకాశం కల్పించాలన్న రెవెన్యూ సంఘాల అభ్యర్థన మేరకు ఈనెల 27న మరోసారి వీరికి అర్హత పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఐదు నక్షా గ్రామాల్లో రీసర్వే పూర్తి
గత ప్రభుత్వం నక్షా లేని గ్రామాలను గాలికి వదిలేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం దీనికి పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో నక్షాలేని 413 గ్రామాలకు గాను 5 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా రీ సర్వేను విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందన్నారు.
పైలెట్ గ్రామాలైన మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్‌నగర్‌లో 422 ఎకరాలు, జగిత్యాల్ జిల్లా భీర్పూర్ మండలం కొమ్మనాపల్లి ( కొత్తది) గ్రామంలో 626 ఎకరాలు, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడ లోని 845 ఎకరాలు, ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురులో 502 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం షాహిద్‌నగర్‌లో 593 ఎకరాల్లో మొత్తం ఐదు గ్రామాల్లోని 2,988 ఎకరాల్లో చిన్న వివాదాలకు తావులేకుండా రైతుల సమక్షంలోనే క్షేత్రస్థాయిలో భౌతికంగా ఈసర్వే పూర్తిచేయడం జరిగిందన్నారు.
దీని వల్ల భూమి సమాచారం, పారదర్శకత, వివాద పరిష్కారం, భూ యాజమాన్యంలో స్పష్టత వస్తుందని ఫలితంగా రైతులు, (Farmers) గ్రామీణ భూ యజమానులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ సర్వే ఫలితాలను పరిగణనలోకి తీసుకొని మిగిలిన గ్రామాల్లో కూడా రీసర్వే నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Also Read: Radhika Yadav Murder Case: తండ్రి చేతిలో టెన్నిస్ ప్లేయర్ హత్య.. వెలుగులోకి నమ్మలేని నిజాలు!