CM Revanth Reddy: ఈ నెల 21వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో సీఎం రేవంత్ రెడ్డి టూర్ ఉండనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా నగరంలోని అంబర్ పేటలోని బతుకమ్మ కుంటకు హైడ్రా పునరుజ్జీవం కల్పించి, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న సంగతి తెల్సిందే. నగరంలో త్వరలో ప్రారంభం కానున్న బతుకమ్మ ఆటా పాటా ఉత్సవాల్లో భాగంగా 21వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ కుంటను ప్రారంభించే అవకాశాలున్నట్లు తెలిసింది. ముందుగా రూపొందించిన ప్రణాళికల ప్రకారం చెరువు చుట్టూ పాత్‌వే, నీడనిచ్చే చెట్ల పెంపకం, ప్రజలు సేదదీరేలా కూర్చునేందుకు వీలుగా హైడ్రా కుంటలో చేపట్టిన అభివృద్ది పనులు ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్నట్లు సమాచారం. చెరువు చుట్టూ అందమైన మొక్కలతో పాటు ఆహ్లాదకర వాతావరణం ఉండేలా పనులు కొనసాగుతున్నాయి. పెద్దలు వచ్చి సేదదీరే విధంగా గుమ్మటాలు నిర్మించారు. హైడ్రా నిధులతో కొనసాగుతున్న బతుకమ్మ ఘాట్ పునరుజ్జీవన పనులు తుది దశలో ఉన్నాయి. చెరువు చుట్టూ అందమైన మొక్కలతో పాటు ఆహ్లాదకర వాతావరణం ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. వయోవృద్దులు, చిన్నారులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా గుమ్మటాలు నిర్మించటంతో పాటు హైజెనిక్‌గా రెస్టు రూమ్‌లు ఉండేలా కుంట అభివృద్ది పనులు కొనసాగుతున్నాయి.
Also Read- Little Hearts: బన్నీ నుంచి చైతూ వరకూ.. ‘లిటిల్ హార్ట్స్’ అందులోనూ టాప్ ప్లేసే!
మహిళా భవన్, మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్
తెలంగాణ సంస్కృతీ, సాంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకునే బతుకమ్మ ఉత్సవాలను బతుకమ్మ కుంట నుంచే ప్రారంభించేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో పాటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తున్న బంజారాహిల్స్ డివిజన్‌లో నూతనంగా నిర్మించిన మహిళా భవన్, మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ను కూడా సీఎం ప్రారంభించనున్నట్లు సమాచారం. నగరంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు, కార్మికులు చాలా మంది వివిధ రకాల పనులు చేసుకునేందుకు ఉదయాన్నే బయల్దేరి ఆకలితోనే పనులు మొదలు పెట్టి, మధ్యాహ్నాం తాము తెచ్చుకున్న భోజనం తిని, కడుపు నింపుకుంటున్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ.. వారికి కేవలం రూ.5 కే ఆరోగ్యకరమైన టిఫిన్ అందించేందుకు ఏర్పాటు చేసిన ఇందిరమ్మ టిఫిన్ స్టాల్ ను కూడా అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిసింది.
Also Read- Mega158 and NBK111: దసరాకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్న టాలీవుడ్ టాప్ హీరోస్.. ఫ్యాన్స్‌కు పండగే
60 ఇందిరమ్మ టిఫిన్ స్టాల్స్ ప్రారంభం
సీఎం ప్రారంభించిన వెంటనే సిటీలోని వివిధ ప్రాంతాల్లో ఒకేసారి 60 ఇందిరమ్మ టిఫిన్ స్టాళ్లలో నాణ్యమైన టిఫిన్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. దీంతో పాటు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ప్రస్తుతం తుది దశలో ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఇప్పటికే మంత్రులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. త్వరలో పూర్తి కానున్న పలు అభివృద్ది పనులను సీఎం ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులకు ఇప్పటికే సీఎం పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవానికి సమయమిచ్చినట్లు, అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని సమాచారం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు