Operation Sindoor: పహల్గాం నరమేధానికి ప్రతీకారంగా భారత భద్రతా దళాలు దిగ్విజయంగా పూర్తి చేసిన ఆపరేషన్ సింధూర్ పట్ల తాను భారతీయునిగా గర్వపడుతున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం భారత సైన్యానికి ప్రతీ ఒక్కరూ మద్దతుగా నిలబడాలని చెప్పారు. ఈ సమయంలో రాజకీయాలకు తావు లేదన్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో బుధవారం బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యవసర సేవలు అందించే ఆయా ప్రభుత్వ విభాగాల ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. సెలవుల్లో ఉన్నవారు వెంటనే విధుల్లో చేరాలన్నారు. మంత్రులు, అధికారులందరూ అందుబాటులో ఉండాలన్నారు. పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
భారత సైన్యానికి సంఘీభావం తెలియచేయటానికి నేడు సాయంత్రం 6గంటలకు సచివాలయం నుంచి నెక్లెస్ రోటరీ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. మంత్రులు, అధికారులు విదేశీ పర్యటనలను రద్దు చేసుకోవాలన్నారు.
కఠిన చర్యలు తప్పవ్…
ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని పంచుకుంటే కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఆయా శాఖల అధికారులు ప్రజలకు 24గంటలపాటు అందుబాటులో ఉండాలన్నారు. ప్రజల కోసం టోల్ ఫ్రీం నెంబర్ ఇవ్వాలని చెప్పారు.
అక్రమంగా ఉంటున్న వారిని…
పాకిస్తాన్, బంగ్లాదేశ్ లకు చెంది అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. దీని కోసం సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నించేవారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలతోపాటు అత్యవసర మందులను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ఇక, ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్ ల అందుబాటుపై సమాచారం తీసుకోవాలని చెప్పారు. రెడ్ క్రాస్ సంస్థతో సమన్వయం కుదుర్చుకోవాలని సూచించారు. ఆహార నిల్వలు తగినంత ఉండేలా జాగ్రత్త పడాలన్నారు. సైబర్ సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఫేక్ న్యూస్ ప్రచారమైతే ప్రజల్లో ఆందోళన పెరుగుతుందని చెబుతూ దీనిని అరికట్టటానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని చెప్పారు.
Also Read: Laxman on Ayodhya: అయోధ్యలో భక్తుల కోసం.. మౌలిక సదుపాయాల.. కల్పనపై చర్చ వేగం!
భద్రతను కట్టుదిట్టం చేయాలి…
ఇక, హైదరాబాద్ లో ఉన్న ఆర్మీ, నేవీ సంస్థల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కూడా భద్రతను పటిష్టం చేయాలని చెప్పారు. హైదరాబాద్ లోని విదేశీ రాయబార కార్యాలయాల వద్ద బందోబస్తును పెంచాలని సూచించారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకులకు తగు రక్షణ కల్పించాలని చెప్పారు.
కేంద్ర నిఘా బృందాలతో సమన్వయాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. రౌడీషీటర్లు, పాతనేరస్తులపై నిఘా పెట్టాలన్నారు. అన్ని జిల్లా కేంద్రాలతోపాటు సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. భారత సైన్యానికి మద్దతుగా నిలవాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, డీజీపీ జితేందర్, హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా, ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ తోపాటు వేర్వేరు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు