Jaganmohan Rao: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు(jaganmohan Rao) లీలలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. మాజీ మంత్రి కృష్ణాయాదవ్సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆయన అధ్యక్షతన ఉన్న శ్రీచక్ర క్రికెట్ క్లబ్ (గౌలిపురా క్రికెట్ క్లబ్)లో సభ్యత్వం ఉన్నట్టుగా జగన్మోహన్ రావు డాక్యుమెంట్లు సృష్టించినట్టుగా సీఐడీ(CID)దర్యాప్తులో వెల్లడైంది. ఈ డాక్యుమెంట్లను అడ్డం పెట్టుకుని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association) లోకి ఎంట్రీ ఇచ్చిన జగన్మోహన్ రావు రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని అధ్యక్షుని స్థానాన్ని చేజిక్కించుకున్నట్టుగా తేలింది. దాంతోపాటు గడిచిన రెండేళ్లలో జగన్మోహన్రావు తన సహచరులతో కలిసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు చెందిన దాదాపు 170 కోట్ల రూపాయలను స్వాహా చేసినట్టుగా కూడా సీఐడీ విచారణలో తేలిందని సమాచారం.
టిక్కెట్లు ఇవ్వలేదని పలు ఇబ్బందులు
చివరకు ఆటగాళ్లను ఎంపిక చేయటంలో కూడా అవినీతికి పాల్పడినట్టుగా నిర్ధారణ అయ్యిందని తెలిసింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ టోర్నమెంట్ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్(Sunrisers) హైదరాబాద్ ఫ్రాంచైజీ మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఉప్పల్ స్టేడియం సిట్టింగ్ కెపాసిటీలో 10శాతం టిక్కెట్లను ఉచితంగా ఇస్తున్నా అదనంగా మరో 10శాతం టిక్కెట్లు ఇవ్వాలని జగన్మోహన్ రావు బెదిరింపులకు పాల్పడ్డాడని సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజ్(Hyderabad Franchise) ప్రతినిధులు ఆరోపించారు. అదనంగా అడిగిన టిక్కెట్లు ఇవ్వలేదని పలు ఇబ్బందులు పెట్టినట్టుగా తెలిపారు. పరిస్థితి ఇలాగే ఉంటే హైదరాబాద్ ను వదిలేసి విశాఖపట్టణం వెళ్లిపోతామని కూడా ప్రకటించారు. దాంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఈ వివాదంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ అధికారులు జరిపిన విచారణలో జగన్మోహన్ రావు అతని సహచరులు సన్ రైజర్స్ హైదరాబాద్ఫ్రాంచైజ్ ను ఇబ్బందులు పెట్టింది నిజమే అని నిర్ధారణ అయ్యింది. దాంతోపాటు జగన్మోహన్ రావు అసోసియేషన్‌లోని మరికొందరితో కలిసి నిధుల దుర్వినియోగానికి కూడా పాల్పడినట్టుగా తేలింది. ఈ మేరకు విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు.
ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు..
అదే సమయంలో తెలంగాణ క్రికెట్అసోసియేషన్(Telangana Cricket Association) ప్రధాన కార్యదర్శి ధరమ్గురవారెడ్డి(Dharamguruva Reddy) సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు చెందిన నిధులను జగన్మోహన్ రావు మరికొందరితో కలిసి దుర్వినియోగం చేసినట్టుగా అందులో పేర్కొన్నారు. ఈ మేరకు సీఐడీ అధికారులు ఐపీసీ 465, 468, 471, 403, 409, 420 రెడ్ విత్ 34 సెక్షన్ల ప్రకారం జూన్9న కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Also Read: Drunken people Hulchul: పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. చివరికి!
మాజీ మంత్రి తమ్మునితో కలిసి
విచారణలో పలు సంచలన వివరాలు వెలుగు చూశాయి. నిబంధనల ప్రకారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఏదైనా పదవి పొందాలనుకుంటే ఏదో ఒక క్రికెట్ క్లబ్లో సభ్యత్వం ఉండాలి. తనకు ఏ క్లబ్ లోనూ సభ్యత్వం లేకపోవటంతో జగన్మోహన్ రావు మాజీ మంత్రి కృష్ణాయాదవ్ అధ్యక్షునిగా ఉన్న శ్రీచక్ర క్రికెట్ క్లబ్ లో చేరాలనుకున్నాడు. ఈ క్రమంలో కృష్ణాయాదవ్ సోదరుడు రాజేందర్ యాదవ్, అతని భార్య కవితతో కలిసి కుట్ర చేశాడు. దాని ప్రకారం కృష్ణాయాదవ్ సంతకాలను ఫోర్జరీ చేసి శ్రీచక్ర క్రికెట్ క్లబ్ లో తనకు సభ్యత్వం ఉన్నట్టుగా డాక్యుమెంట్లు క్రియేట్ చేశాడు. వీటి ద్వారా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లోకి ఎంట్రీ ఇచ్చాడు. బీఆర్ఎస్(BRS) పార్టీ నాయకులు కొందరితో సన్నిహిత సంబంధాలు ఉండటం అప్పట్లో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం అధికారంలో ఉండటంతో వీటిని ఉపయోగించుకుని ఏకంగా హైదరాబాద్క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడయ్యాడు.
అవినీతికి శ్రీకారం..
ఇలా అడ్డదారిలో అధ్యక్షునిగా మారిన జగన్మోహన్ రావు ఆ తరువాత అవినీతికి తెర లేపాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి దేవరాజ్ రామచందర్, కోశాధికారి జగన్నాథ్ శ్రీనివాస రావు, సీఈవో సునీల్ కుమార్ కంటె, సెక్రటరీ దేవరాజ్ రామచందర్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్, అధ్యక్షురాలిగా ఉన్న అతని భార్య కవితతో కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడు. క్రికెట్ అభివృద్ధి కోసం బీసీసీఐ(BCCI) నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించాడు. దాంతోపాటు ఆటగాళ్ల ఎంపికలో సైతం అవినీతికి పాల్పడ్డాడు. ఆయా క్రీడాకారులు తల్లిదండ్రుల నుంచి భారీ మొత్తాల్లో డబ్బు తీసుకుని వారిని సెలెక్ట్ చేస్తూ వచ్చాడు. ఇక, మ్యాచ్ లు జరిగినపుడు వచ్చిన కాంప్లిమెంటరీ పాసులను సైతం అమ్ముకున్నాడు. విచారణలో సీఐడీ అధికారులు ఈ వివరాలను నిర్దారంచుకున్నారు. దీనిపై సీఐడీ అదనపు డీజీపీ చారూ సిన్హా మాట్లాడుతూ హైదరాబాద్ క్రికెట్అసోసియేషన్ లో జరిగిన అవినీతిపై అందిన ఫిర్యాదులో నిశితంగా విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు జగన్మోహన్ రావు, శ్రీనివాసరావు, సునీల్ కుమార్ కంటె, రాజేందర్ యాదవ్, ఆయన భార్య కవితలను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. మిగితా నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందన్నారు.
కస్టడీకి..
కాగా, ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రావుతోపాటు మిగితా నిందితులను కస్టడీకి తీసుకుని విచారణ జరపాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నిందితులను 10 రోజులపాటు కస్టడీకి అనుమతించాలని కోరుతూ మల్కాజిగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.
Also Read: Minister Seetakka: గిరిజన ప్రాంతంలో నకిలీ పదం వినిపిస్తే సహించం!