Ap-TG Water Disputes: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్రం ఏడు రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున అధికారులను నియమించింది. మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్ర జల శక్తి శాఖ సూచించింది. కేంద్ర జల సంఘం చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో తెలంగాణ నుంచి ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్‌సీ అంజద్ హుస్సేన్ కమిటీలో ఉన్నారు. కమిటీ తొలి సమావేశం ఈ నెల 30న జరగబోతున్నది. కృష్ణ, గోదావరి జలాలపై తెలంగాణకు రావలసిన వాటాపై ఏఏ అంశాలను ఇందులో నివేదిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
పార్టీల మధ్య నీటి పంచాయితీ నేపథ్యంలో
కృష్ణా జలాల అంశంపై ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు అంటూ సంతకాలు మీరంటే మీరు చేశారని ఒకరిపై ఒకరు విమర్శ ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అసెంబ్లీ వేదికగా ఇరువురు తెలంగాణకు అన్యాయం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేసుకున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రజల్లో తాము నీటి వాటాలపై పోరాడుతున్నామని పేర్కొన్నారు. అయితే, కమిటీ సమావేశంలో కృష్ణా జలాలపై తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర అధికారులు ఏ మేరకు గళం వినిపిస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
కమిటీ ముందుకు అన్ని వివరాలు
మరోవైపు, గోదావరి నుంచి 200 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏపీ పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును చేపడుతున్నది. దీనిని అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే, రిట్ పిటిషన్ వెనక్కి తీసుకున్నది. సుప్రీంకోర్టు సూచన మేరకు మళ్లీ సూట్ వేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఈ తరుణంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ విమర్శలకు పదును పెట్టింది. నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సహకరిస్తున్నారని, అందుకే రిట్ పిటిషన్ వెనక్కి తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నది. వాటికి చెక్ పెట్టేందుకు ఈ నెల 30న జరిగే కమిటీ సమావేశంలో నీటి వాటాపై అధికారులు గళం వినిపిస్తారని సమాచారం. తెలంగాణకు రావాల్సిన వాటా, ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న నల్లమల సాగర్‌తో జరుగుతున్న నష్టం, ఇప్పటికే కృష్ణ వాటర్ నిబంధనకు విరుద్ధంగా తరలిస్తున్న నీటి వివరాలు ఈ సమావేశంలో కమిటీ ముందు ఉంచనున్నట్లు సమాచారం.
Also Read: AP-TS Water Disputes: ఢిల్లీకి నీటి పంచాయితీ.. తేల్చుకోనున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు
ఏపీ దూకుడుకు బ్రేక్ వేస్తారా?
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నీటి జలాలపై వితండవాదం చేస్తున్నది. తాము సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటున్నామని, తాము నిర్మించబోయే నల్లమల ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం జరగదని వాదిస్తున్నది. కేంద్రానికి సైతం ఇదే వివరిస్తున్నది. మిగులు జలాలను మాత్రమే వాడుకుంటామని పేర్కొంటుంది. అయితే, తెలంగాణ మాత్రం ఈ ప్రాజెక్టును నిర్మిస్తే తమకు నష్టం జరుగుతుందని అంటున్నది. సీడబ్ల్యూసీ నీటి కేటాయింపు సమయంలో ప్రాజెక్టును బట్టి వాటాలు వస్తాయని, నల్లమల సాగర్ పూర్తయితే తెలంగాణకు రావాల్సిన వాటాలో కొంత కోల్పోవాల్సి వస్తుందని పేర్కొంటుంది. నల్లమల ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఇప్పటికే తెలంగాణ అన్ని మార్గాలను అన్వేషిస్తున్నది. ఈ తరుణంలో తొలి కమిటీ సమావేశంలో ఎలాంటి వాదనలు వినిపిస్తారనేది హాట్ టాపిక్ అయింది.
వివాదాలు పరిష్కారం అయ్యేనా?
మరోవైపు, కమిటీ ప్రధానంగా రాష్ట్ర విభజన చట్టం 2014లోని సెక్షన్ 89 ప్రకారం పెండింగ్‌లో ఉన్న అంశాలపై దృష్టి సాధించనున్నదని సమాచారం. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల నికర పంపిణీ, శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద టెలిమెట్రీ వ్యవస్థల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతల బదిలీ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నది. నల్లమల సాగర్, పోలవరం వంటి వివాదాస్పద అంశాలపై సాంకేతిక నివేదికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పిస్తుందని తెలిసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. గతంలో ట్రైబ్యునళ్లలో విచారణలు ఏళ్ల తరబడి సాగగా, ఇప్పుడు ఈ సాంకేతిక కమిటీ ద్వారా త్వరితగతిన సమస్యలను పరిష్కరించే అవకాశం ఉన్నది. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు, గోదావరి బోర్డు కార్యాలయాన్ని తెలంగాణకు తరలించే ప్రక్రియపై కూడా ఈ కమిటీ సమన్వయం చేయనున్నది. ఈ కమిటీ నిర్ణయాలు రెండు రాష్ట్రాల రైతులకు మేలు చేకూర్చడంతో పాటు, అనవసరమైన రాజకీయ ఘర్షణలను తగ్గించగలవని కేంద్రం ఆశిస్తున్నది.
Also Read: BRS Party: కారును పోలిన గుర్తులు తొలగింపుపై ఈసీపై ఒత్తిడి

