Jubilee Hills Bypoll: బీఆర్ఎస్, కాంగ్రెస్ ఢీ
రెండు పార్టీల మధ్యే జూబ్లీహిల్స్ పోరు
సర్వశక్తులు ఒడ్డుతున్న ఇరుపార్టీలు
చేసిన అభివృద్ధి ఒకవైపు.. వైఫల్యాలు మరోవైపు
ఒకరిపై ఒకరు మాటల తూటాలు
సోషల్ మీడియా వేదికగానూ విమర్శనాస్త్రాలు
మరోవైపు పోలీసు స్టేషన్లలోనూ పోటాపోటీగా ఫిర్యాదులు
రోజురోజుకు రసవత్తరంగా మారుతున్న జూబ్లీహిల్స్ రాజకీయం
మూడోస్థానానికే ‘కమలం’
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై (Jubilee Hills Bypoll) రాష్ట్రంలో విస్తృత చర్చజరుగుతోంది. ఏ పార్టీ గెలుస్తుందా? అనేది సైతం ఆసక్తి నెలకొంది. అయితే ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభమై నెలరోజులు గడుస్తుంది. మరో 14 రోజుల మాత్రమే ప్రచారానికి గడువు ఉంది. అయినప్పటికీ ఈ ఎన్నికల ప్రచారంలో రెండుపార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ లే ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. నువ్వా..నేనా అన్నట్లుగా ప్రచార సరళిని సైతం కొనసాగిస్తున్నాయి. సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. పార్టీ సీనియర్ నేతలందరికి ప్రచార బాధ్యతలు అప్పగించాయి. ఈ రెండు పార్టీల మధ్యే పోరు కొనసాగబోతుందనేది ప్రస్తుత ప్రచారమే స్పష్టం చేస్తుంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఎలాగైనా జూబ్లీహిల్స్‌లో విజయం సాధించి రెండో అసెంబ్లీ నియోజకవర్గంలో తన ఖాతాలో వేసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. అంతేకాదు రాబోయే గ్రేటర్, స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ విజయం దోహదపడుతుందని భావించి పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే అభ్యర్థి ఎంపికను చేసి బీఆర్ఎస్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. మరోవైపు మంత్రివర్గంతో పాటు సీనియర్ నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను, కాంగ్రెస్ రెండేళ్లలో చేసిన అభివృద్ధి, జూబ్లీహిల్స్‌లో గెలిస్తే చేయబోయే కార్యక్రమాలను వివరిస్తున్నారు. పేదలకోసం చేపడుతున్న సంక్షేమం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు నియోజకవర్గంలో పదేళ్లుగా చేయని అభివృద్ధి పనులను ఎత్తిచూపుతున్నారు. ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలను చేపడుతున్నారు. అన్నివర్గాల ప్రజలతో భేటీ అవుతూ అమలు చేస్తున్న పథకాలను వివరిస్తున్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రధాన ప్రచార అస్త్రాలుగా చేసుకొని ప్రజలముందుకు వెళ్తున్నారు.
Read Also- Sankranthi Movies: సంక్రాంతి రేసు నుంచి రాజు తప్పుకుంటున్నాడా? కారణం ఆ తమిళ హీరోనేనా?
బీఆర్ఎస్ పార్టీ సైతం అధికారంలో ఉన్న పదేళ్లు చేసిన అభివృద్ధి, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, వైఫల్యాలను వివరిస్తుంది. హైడ్రాతో ఇళ్లు కూలుస్తుందనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో వైఫల్యం, జాబ్ క్యాలెండర్, మహిళలకు ఇస్తామన్న హామీలు అమలు చేయలేదని, విద్యారంగం కుంటుపడిందని, మైనార్టీలను విస్మరించిందని, వక్ఫ్ చట్ట సవరణకు కాంగ్రెస్ మద్దతు తెలిపిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అనే అంశాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తుంది. నగరంలో శాంతి భద్రతలు క్షిణించాయని,విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం లేదని, గురుకులాల్లో సమస్యలు తిష్టవేశాయని, విదేశీ విద్యకోసం స్కాలర్ షిప్ ఇవ్వడం లేదని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇలా అన్ని వర్గాలను మోసం చేసిందనే అంశాలను వివరిస్తున్నారు. అంతేకాదు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు ఇలా అన్ని వర్గాలకు చెందిన నేతలతో వారివారి కులాల ప్రాతిపదికన సమావేశాలు నిర్వహించి ఓటర్లను ఆకర్షించడం. మరోవైపు ప్రచార బాధ్యతలను అప్పగించింది. ప్రతీ ఓటర్ ను కలిసేలా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు.
ప్రచారం రోజురోజుకు వేడెక్కుతోంది. వైఫల్యాలను ఎత్తిచూపకుండా వ్యక్తిగత దూషణల వరకు వెళ్తున్నారు. పోటీచేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులపైనా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పోటీపడి మరి వారి వ్యక్తిగత అంశాలను సైతం ప్రస్తావిస్తూ కాంట్రవర్సీ అవుతున్న ఘటనలు ఉన్నాయి. అంతేకాదు కొంతమంది బీఆర్ఎస్ నేతలు తమకు సహకరిస్తున్నారని కాంగ్రెస్, లేదు తమకు ఆపార్టీలోని కొందరు సహకరిస్తున్నారని బీఆర్ఎస్ ఇలా రెండు పార్టీలకు చెందిన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు దర్శనం ఇవ్వడం.. ఇరు పార్టీలకు చెందిన వారు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకుంటూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. అంతేకాదు దూషణలు చేస్తున్నారని ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం పరిపాటిగా మారింది. సోషల్ మీడియా వేదికగా వ్యంగాస్త్రాలు, కార్టూన్లతోనూ ప్రచారం ఊపందుకుంది.
Read Also- Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?
మరోవైపు బీజేపీ పార్టీ గట్టిపోటీఇస్తుందని తొలుత అందరూ భావించారు. కానీ ఆపార్టీ ప్రచారంలోనే వెనుకబడిందనే ప్రచారం జరుగుతుంది. అంతేకాదు పార్టీకి చెందిన కేంద్రమంత్రులతో పాటు కొంతమంది మాత్రమే ప్రచారం చేస్తుండగా, పార్టీ సీనియర్లు దూరంగా ఉండటం ఇప్పుడు ఆపార్టీలోనే చర్చకు దారితీసింది. తొలుత తామే విజయం సాధిస్తామని కొంతమంది నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేసినప్పటికీ ప్రస్తుతం ప్రచారంలోనే వెనుకబడినట్లు స్పష్టమవుతోంది. బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మూడోస్థానానికే పరిమితం అవుతుందని ఆపార్టీలోని కొందరు నేతలే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అందులో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. ఈ రెండు పార్టీల భవిష్యత్ ను సైతం ఈ ఉప ఎన్నికల ఫలితాలతో వెల్లడికానుంది.
