BRS Party: పంచాయతీ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. కానీ ప్రస్తుతం అనుసరిస్తున్న తీరుతో చేతులెత్తేసినట్లు స్పష్టమవుతోంది. ఒక్కో గ్రామంలో పార్టీ లో పనిచేసిన వారే ముగ్గురునలుగురు నామినేషన్లు వేయడం..వారిని సముదాయించేవారు లేకపోవడం.. వారికి పార్టీ సరైన హామీ సైతం ఇవ్వకపోవడంతో బరిలో నిలిచే పరిస్థితి నెలకొంది. దీంతో పార్టీలోని నాయకులే వారిని వారే ఓడించుకునే పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామాల్లో పట్టుసాధిస్తామని పేర్కొన్న అధిష్టానం.. ఇప్పుడు వారిలో ఆ ధీమా కనబడకపోవడంతో మెజార్టీ స్థానాల్లో విజయంపై నీలినీడలు కమ్ముకున్నట్లు అవుతుంది.
ఒక్కో గ్రామం నుంచి ఇద్దరికిపైగా..
రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగిసింది. రెండో విడత నామినేషన్ల గడువు సైతం ముగిసింది. అయితే బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం సీరియస్ గా దృష్టిసారించినట్లు మాత్రం కనబడటం లేదని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. ఒక్కో గ్రామం నుంచి ఇద్దరికిపైగా పార్టీకి చెందినవారే నామినేషన్లు వేశారు. అయితే వారిని ఏకతాటిపైకి తీసుకొచ్చి సముదాయించాల్సి ఉంది. అవసరం అయితే వారిని బుజ్జగించి పదవుల ఆఫర్ ప్రకటించాల్సి ఉంది. కానీ ఆదిశగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జులుగానీ, పార్టీ అధిష్టానం గానీ చొరవ తీసుకోవడం లేదని ద్వితీయశ్రేణి నాయకులు పేర్కొంటున్నారు. నామినేషన్ వేసిన అభ్యర్థులకు సైతం భరోసా ఇవ్వడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కనీసం నేతలతోనే మాట్లాడటం లేదని, ఏకాభిప్రాయం సైతం తీసుకొచ్చే ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గెలుపుకోసం కనీసం పార్టీ ఇన్ చార్జులు ప్రయత్నం చేయడం లేదని సమాచారం.
పార్టీతో సంబంధం లేకుండా..
కొన్ని గ్రామాల్లో పార్టీలోని నేతలే కూర్చొని సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. గెలిస్తే ఏం చేస్తామని, ఉపసంహరించుకున్నవారికి ఏం పనులు అప్పగిస్తారనేది అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. పార్టీతో సంబంధం లేకుండానే నేతలే నిర్ణయం తీసుకుంటున్నారు. మెజార్టీ గ్రామాల్లో మాత్రం పోటీ నుంచి ఉపసంహరణకు ససేమిరా అంటున్నట్లు సమాచారం. బరిలో ఉంటే ఓడిపోతామని తెలిసినా ససేమిరా అంటున్నట్లు తెలిసింది. ఈ విషయం నియోజకవర్గ ఇన్ చార్జులకు తెలిసినా ఏమిపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇన్ చార్జులు జోక్యం చేసుకుంటే గ్రామాలకు ఫండింగ్ ఇవ్వాల్సి వస్తుందనే ఏమిపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇలా అయితే భవిష్యత్ లో పార్టీ మనుగడ కష్టమేనని పార్టీలోనే నేతలే బహిరంగంగా అభిప్రాయపడుతున్నారు.
ఎవరు గెలిచి వస్తే వారే బీఆర్ఎస్..
మరోవైపు పార్టీకి అనుబంధంగా పోటీ చేస్తున్నానని తమకు పార్టీ మద్దతు కావాలని, పార్టీ నుంచి ఇతరులు వేసిన నామినేషన్లు ఉపహరింపజేయాలని పలువురు సర్పంచ్ అభ్యర్థులు పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నట్లు సమాచారం. పార్టీ అధిష్టానం చొరవ తీసుకొని టికెట్ల విషయంలో ఏకాభిప్రాయంకు తీసుకురావాల్సి ఉంది. కానీ పార్టీ అధిష్టానం మాత్రం ఎవరు సర్పంచ్ గా గెలిచి వస్తే వారే బీఆర్ఎస్ పార్టీ అని తేల్చి చెబుతున్నట్లు సమాచారం. దీంతో ఏం చేయాలో తూచక నిరాశతో వెనుదిరుగుతున్న సందర్భాలు సైతం ఉన్నాయి. ఇది పార్టీ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరికి నిదర్శమని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా అయితే రాబోయే కాలంలో పార్టీకి గడ్డుకాలమేనని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.
నియోజకవర్గానికే ఇద్దరు నేతలు పరిమితం
పార్టీలో కేటీఆర్, హరీష్ రావు లు ఇద్దరు కీలక నేతలు. వారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి కేడర్ ను ఉత్తేజపరిచి మెజార్టీ స్థానాల్లో విజయం సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తారని నేతలు భావించారు. కానీ ఆ ఇద్దరు నేతలుసొంత నియోజకవర్గాలకే పరిమితం అయ్యారు. వారివారి నియోజకవర్గాల్లోనే మెజార్టీ సర్పంచ్ స్థానాలపై ఫోకస్ పెట్టారు. దీంతో ఇతర నియోజకవర్గాల్లోని గ్రామాల్లో విజయం ఎలా సాధిస్తారనేది ఇప్పడు హాట్ టాపిక్ అయింది. అంటే బీఆర్ఎస్ పార్టీ పంచాయతీ ఎన్నికలను నామమాత్రంగా తీసుకుంటుందనేది ఇప్పుడు చర్చకు దారితీసింది.
Also Read: Putin India Visit: రేపే భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్.. అసాధారణ భద్రతకు ఏర్పాట్లు..

