KTR on CM Revanth: తెలంగాణ రాష్ట్రాన్ని మెులిపించిన మెుగోడు, మెునగాడు కేసీఆర్ (KCR) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి తిట్టడం తప్ప మరొకటి తెలియదని ఎద్దేవా చేశారు. జనగామలో పర్యటించిన కేటీఆర్.. అక్కడ బీఆర్ఎస్ సర్పంచుల అభినందన సభలో పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ ను మెులకెత్తనీయమని సీఎం రేవంత్ శపథం చేస్తున్నారని.. అది ఆయన వల్ల కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘రేవంత్‌ది పేమెంట్ సీట్’
కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చేస్తున్న వ్యాఖ్యలపై కూడా కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితినే లాగు తడిచిందన్న కేటీఆర్.. ఇక నేరుగా అసెంబ్లీకి వస్తే గుండె ఆగి చస్తావ్ అంటూ విమర్శించారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల విజయం నాయకులది కాదని, పూర్తిగా కార్యకర్తలదేనని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాట్లాడితే కేసులు పెడుతున్నారని, పోలీసులు ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పేమెంట్ సీట్ ముఖ్యమంత్రి అన్న కేటీఆర్.. రాహుల్ గాంధీకి మూటలు మోయడం తప్ప ఆయనకు ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు.
420 హామీలు ఇచ్చి మోసం
రాష్ట్రంలో చెక్ డ్యామ్స్ పేలుతుంటే సీఎం కళ్లప్పగించి చూస్తున్నారని ఆరోపించారు. కృష్ణా, గోదావరి బేసినట్ల గురించే ఆయనకు సరిగ్గా తెలియదన్న కేటీఆర్.. ఇక కేసీఆర్ కు నీళ్ల గురించి ఏం చెబుతారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యూరియా ఇబ్బందులు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ వచ్చాయని కేటీఆర్ ఆరోపించారు. గతంలో వరంగల్ కు వచ్చిన రాహుల్ గాంధీ.. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు హామీ ఇచ్చి వెళ్లారన్నారు. రాహుల్ గాంధీ లీడర్ కాదని.. రీడర్ అంటూ సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ మాటలు నమ్మి యువత కాంగ్రెస్ కు ఓట్లు వేశారని గుర్తుచేశారు. 420 హామీలు ఇచ్చి మోసం చేసినందుకు రాహుల్ గాంధీని ఉరితీయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read: Roja On Nara Lokesh: మీరు చేసేది చాలా తప్పు.. పదింతలు అనుభవిస్తారు.. రోజా స్ట్రాంగ్ వార్నింగ్
కవిత మాటలపై కౌంటర్
తెలంగాణ శాసన మండలిలో కవిత చేసిన విమర్శల పైనా కేటీఆర్ స్పందించారు. కుటుంబం అన్నాక సమస్యలు ఉంటాయని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో అలగడాలు సహజమేనన్నారు. ఏదైనా ఉంటే ఇంట్లో అనుకోవాలి, కలిసి కొట్లాడాలని పరోక్షంగా కవితకు చురకలు అంటించారు. మరోవైపు 2028 ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనేనని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

