BRS: బీఆర్ఎస్ పార్టీకి కుటుంబ సానుభూతి కలిసి రావడం లేదని మరోసారి రోజువైంది. కుటుంబంలో ఒకరు చనిపోతే అదే కుటుంబం నుంచి ఎన్నికలకు వెళ్తే ప్రజలు విశ్వసించడం లేదు. పార్టీ నేతలు సైతం ఆశించిన స్థాయిలో పని చేయకపోవడంతో ఓటమి పాలవుతున్నట్లు స్పష్టమవుతున్నది. అయినప్పటికీ పార్టీ మాత్రం ఆ కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వడం, ప్రజల సానుభూతి పొందాలని అనుకొని విఫలం కావడం పరిపాటిగా మారింది. దీంతో గులాబీ పార్టీపై నేతలతో పాటు కేడర్‌లోనూ అసంతృప్తి వ్యక్తం అవుతున్నది.
ఎన్నో ఎదురుదెబ్బలు.. అయినా కూడా..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అందులో పాలేరు, నారాయణఖేడ్, నాగార్జునసాగర్, హూజూర్‌నగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. దుబ్బాక, హుజూరాబాద్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పరాజయం పాలైంది. దుబ్బాక, హుజూరాబాద్‌లో బీజేపీ విజయం సాధించగా, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే, పాలేరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి మృతి చెందితే అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కిష్టారెడ్డి చనిపోతే బీఆర్ఎస్ నుంచి భూపాల్ రెడ్డి విజయం సాధించారు. మునుగోడు, హుజూరాబాద్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వచ్చాయి. మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం సాధించగా, హుజూరాబాద్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గెలిగారు. ఇక హుజూర్‌నగర్ నుంచి గెలుపొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరిగి ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించడంతో అక్కడ బీఆర్ఎస్ విజయం సాధించిది.
Also Read: Kavitha: ఘనపూర్ ప్రాజక్టు ఎత్తు పెంపు పనులు వెంటనే ప్రారంభించాలి : కవిత
ఆ ఒక్క నియోజకవర్గంలో..
నాగార్జునసాగర్, దుబ్బాక, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మృతి చెందితే ఉప ఎన్నికలు వచ్చాయి. నాగార్జునసాగర్‌లో నోముల నర్సింహయ్య మృతి చెందితే ఆయన తనయుడు భగత్‌కు టికెట్ ఇస్తే విజయం దక్కింది. ఆ ఒక్క నియోజకవర్గంలో మాత్రమే బీఆర్ఎస్‌కు ప్రజల్లో సింపతీ పని చేసింది. మిగిలిన దుబ్బాక, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కుటుంబం సానుభూతి పని చేయలేదు. ఆ కుటుంబానికి తిరిగి టికెట్ ఇవ్వడంతో పార్టీ సీనియర్ నేతలు కూడా నరాజ్ అయ్యారు. కొంతమంది వద్దు అని వారించినప్పటికీ పార్టీ టికెట్ ఇచ్చి సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిందని విమర్శలు వస్తున్నాయి. పార్టీ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఏకపక్షంగా వ్యవహరించి ఓటమిపాలై కేడర్‌లో నైరాశ్యం నింపిందనే ప్రచారం జరుగుతున్నది. నాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో ఓడిపోవడంతో విమర్శలు వచ్చాయి. పార్టీ సరైన ప్రణాళికలతో పోకపోవడంతోనే ఓటమికి కారణమనే ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ నేతల అభిప్రాయాలను, కేడర్‌లో పార్టీపై ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే ఇప్పుడు జూబ్లీహిల్స్‌లోనూ ఓటమి తప్పలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: KTR Iron Leg: కేటీఆర్ ఐరన్ లెగ్.. జూబ్లీహిల్స్ ఫలితంపై బండి సంజయ్ షాకింగ్ పంచ్‌లు
