Municipal Elections 2026: ఇన్ఛార్జుల నియామకం
గెలుపు గుర్రాలు గుర్తించి పార్టీకి నివేదికలు
ఎన్నికల సరళి, గ్రౌండ్ రిపోర్టులు సైతం అందజేత
బూత్ లెవల్ ఏజెంట్లతో సమన్వయం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల (Municipal Elections 2026) కోసం బీఆర్ఎస్ పార్టీ (BRS Party) మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సమన్వయకర్తలను నియమించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఈ మేరకు శనివారం ప్రకటించారు. రాష్ట్రంలో 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు ఉన్నాయి. ప్రతి మున్సిపాలిటీకి , కార్పొరేషన్లకు ఒక సీనియర్ నాయకుడికి ఎన్నికల ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను ఏకం చేయడం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల వ్యూహాలను రూపొందించడం సమన్వయకర్తల ప్రధాన బాధ్యతగా అని కేటీఆర్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ముగిసే వరకు వీరు నిరంతరం ఆయా మున్సిపాలిటీల్లో అందుబాటులో ఉంటారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఈ సమన్వయకర్తలు కీలక పాత్ర పోషిస్తారన్నారు.
స్థానిక నాయకత్వంతో చర్చించి, గెలుపు గుర్రాలను గుర్తించి, నివేదికలను ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానానికి సమర్పిస్తారన్నారు. పార్టీ రూపొందించిన ప్రచార కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడం, బూత్ లెవల్ ఏజెంట్లను సమన్వయం చేయడం వంటి అంశాలను పర్యవేక్షిస్తారని తెలిపారు. ఎన్నికల సరళి, గ్రౌండ్ రిపోర్టులను ఎప్పటికప్పుడు తెలంగాణ భవన్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయానికి, వర్కింగ్ ప్రెసిడెంట్‌కి నివేదించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. పార్టీ తరపున నియమించబడిన మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్తల పూర్తి జాబితాను కేటీఆర్ అధికారికంగా విడుదల చేశారు. ప్రజల మద్దతుతో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు.
Read Also- Bullet Bikes Thieves: దొంగలు దొరికారు.. వామ్మో ఎన్ని బుల్లెట్స్ దొరికాయో తెలుసా?
తెలంగాణ సమాజం ఫ్యాక్షన్ సంస్కృతిని సహించదు
జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ గుండాలు దాడికి యత్నించిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సాక్షాత్తూ మంత్రి సీతక్క సమక్షంలోనే పట్టపగలు కొందరు కాంగ్రెస్ గుండాలు తాగొచ్చి వీధిరౌడీల్లా వ్యవహరించడం తెలంగాణలో దిగజారిన శాంతిభద్రతలకు అద్దంపడుతోందన్నారు. అధికారికంగా జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల వద్ద కూడా “డ్రంక్ అండ్ డ్రైవ్” టెస్టులు పెట్టాల్సిన దుస్థితి తెలంగాణలో నెలకొందన్నారు. ముఖ్యమంత్రే స్వయంగా నేరాలను పెంచి పోషించేలా ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో లా అండ్ ఆర్డర్ ను తీవ్రంగా దెబ్బతీసే సంఘటనలు జరుగుతున్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీతోపాటు తెలంగాణ సమాజం కూడా ఈ గడ్డపై ఇలాంటి ఫ్యాక్షన్ సంస్కృతిని ఎట్టిపరిస్థితుల్లో సహించదన్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాతపెట్టిందన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రికి, అధికార పార్టీ అరాచక పర్వానికి తెలంగాణ ప్రజలు తప్పకుండా సరైన గుణపాఠం చెబుతారన్నారు.
Read Also- Laddu Adulterated Ghee: ఛార్జిషీట్‌ను ఆయుధంగా మలుచుకున్న వైసీపీ.. చంద్రబాబు, పవన్ ఇరుకునపడినట్టేనా?

