MP Bandi Sanjay: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) లేఖ రాశారు. ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రూ.8 వేల కోట్ల బకాయిలులు పేరుకుపోయాయని బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యపూరిత ధోరణి వల్ల లక్షలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆరోపించారు. బకాయిలు చెల్లించకపోవడంతో ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్, నర్సింగ్ సహా వేలాది కాలేజీలు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయాయని ఆరోపించారు.
గతంలోనే ప్రభుత్వం దృష్టికి
కొన్ని కాలేజీలు ఫీజులు చెల్లించనిదే విద్యార్థులకు సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం లేదని లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు. మరికొన్ని విద్యా సంస్థలు అధ్యాపకులకు, సిబ్బందికి జీతభత్యాలు, మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా చెల్లించలేక అవస్థలు పడుతున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే అనేక రూపాల్లో గత ప్రభుత్వ పెద్దలతోపాటు మీ ద్రుష్టికి కూడా తీసుకువచ్చానని సీఎం రేవంత్ కు బండి గుర్తు చేశారు.
హామి ఇచ్చినా చేయలేదు
ఫీజు రీయింబర్స్ మెంట్ ను వన్ టైమ్ లో సెటిల్ చేసే బాధ్యతను మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగిస్తున్నట్లు గతేడాది సీఎం రేవంత్ రెడ్డే స్వయంగా చెప్పిన విషయాన్ని లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ ‘‘ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను 12 భాగాలుగా విభజించి 12 నెలలపాటు చెల్లిస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో మీరు ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం అత్యంత దురద్రుష్టకరమని బండి అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంవల్ల రాష్ట్ర ప్రభుత్వంపట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఏర్పడిందని పేర్కొన్నారు.
Also Read: Minister Rajnath Singh: పాక్‌కు రక్షణ మంత్రి మాస్ వార్నింగ్.. గూస్ బంప్స్ రావాల్సిందే!
తీవ్ర పరిణామాలు తప్పవు
బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం.. కీలకమైన విద్యా వ్యవస్థ ఇంత నిర్లక్ష్యం వ్యవహరించడం ఏమాత్రం సమంజసనీయం కాదని లేఖలో బండి సంజయ్ అన్నారు. విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలపట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి క్షమించరానిదని పేర్కొన్నారు. ఇకనైనా విద్యార్థుల భవిష్యత్తు, యాజమాన్యాల మనుగడను ద్రుష్టిలో ఉంచుకుని తక్షణమే ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని కోరారు. లేనిపక్షంలో జరగబోయే పరిణమాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.