Kaleshwaram CBI Probe: మొదటి నుంచి సీబీఐ విచారణ కోరుతున్నాం
బీఆర్ఎస్‌ను కాపాడేందుకు కాంగ్రెస్ ఆలస్యం చేసింది
నిజానికి తలవంచి సీబీఐకి అప్పగించింది
వెంటనే సీబీఐకి లేఖ పంపాలన్న కేంద్ర మంత్రి బండి సంజయ్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : కాళేశ్వరంపై బీజేపీ వైఖరే నిజమని మరోసారి రుజువైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాళేశ్వరం అవినీతికి పూర్తిగా బీఆర్ఎస్ బాధ్యత వహించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలపై మొదటి నుంచే తాము సీబీఐ విచారణ కోరుతున్నామని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్‌ను కాపాడుతూ చర్యలు ఆలస్యం చేసిందని విమర్శలు చేశారు. చివరకు నిజానికి తలవంచి కేసును సీబీఐకి అప్పగించేందుకు అంగీకరించిందని బండి ఆరోపించారు. వెంటనే సీబీఐకి లేఖ పంపాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలోనూ కాంగ్రెస్ అసెంబ్లీలో ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై సిట్‌ను ప్రకటించినా నేటికీ ఆచరణ రూపం దాల్చలేదన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం ఇప్పటికీ డైలీ సీరియల్‌లా కొనసాగుతోందని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.
సీబీఐకి అప్పగించడం మంచిదే: ఎంపీ ఈటల రాజేందర్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగించడంపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. విచారణను సీబీఐకి అప్పగించడం మంచిదేనని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు చేతకాదని తమకు తెలుసనని, వాళ్ల రిపోర్టు తప్పుల తడక అని కూడా తమకు అవగాహన ఉందన్నారు. వాళ్ల రిపోర్టు నిలవదని కాంగ్రెస్‌కు అర్థమైంది.. కాబట్టే దాని నుంచి దూరం జరగేందుకు ఈ పని చేశారని ఈటల ఆరోపించారు. సీబీఐ సంపూర్ణంగా ఎంక్వైరీ చేస్తుందనే నమ్మకముందని చెప్పారు. కాళేశ్వరంపై జరిగిన అక్రమాలను బయటపెడుతుందనే సంపూర్ణ విశ్వాసం తమకు ఉందని పేర్కొన్నారు.
Read Also- Viral Video: ప్రభుదేవా సాంగ్‌కు.. దుమ్మురేపిన ప్రొఫెసర్.. డ్యాన్సర్లు సైతం కుళ్లుకోవాల్సిందే!
బీఆర్ఎస్ పిచ్చివాగుడు: ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: పీసీ ఘోష్, ఎన్డీఎస్ఏ రిపోర్టులపై బీఆర్ఎస్ పిచ్చి వాగుడు వాగుతోందని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు సభలో చిల్లరగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేటీఆర్, హరీశ్ రావు తీరు ప్రజలు ఛీదరించుకునేలా ఉందన్నారు. బీఆర్ఎస్‌కు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం విచారణను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. కాళేశ్వరం అవినీతి సొమ్ము దేశాలు దాటిందని ఆయన ఆరోపించారు. వీటిపై పక్షపాతం లేకుండా విచారణ జరగాలంటే సీబీఐ ఎంక్వైరీనే కరెక్ట్ అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే కాళేశ్వరం కేసును సీబీఐ విచారణకు అప్పగించి ఉంటే ఈపాటికి వాస్తవాలు బయటికి వచ్చేవని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా సీబీఐ విచారణకు ఇచ్చినందుకు కాంగ్రెస్‌కు హరీశ్ బాబు ధన్యవాదాలు తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఎవరు మాట్లాడినా.. వారు కాంగ్రెస్ నేతలు అయిపోతారా? అంటూ హరీశ్ బాబు మండిపడ్డారు. ఎవరు మాట్లాడినా వారిపై బట్ట కాల్చి మీద వేయడం బీఆర్ఎస్‌కు అలవాటుగా మారిందని విమర్శలు గుప్పించారు. బీజేపీ-కాంగ్రెస్ కలిసి సీబీఐ విచారణకు ఇచ్చారని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతల తీరు అత్త తిట్టిన బాధ కంటే తోటి కోడలు తిట్టిందనే బాధ ఎక్కువైంది అన్నట్టుగా పరిస్థితి మారిందని ఎద్దేవాచేశారు. కాళేశ్వరం కుంభకోణాన్ని సీబీఐకి అప్పగించడంతో తమ బండారం ఎక్కడ బయటపడుతుందో అని బీఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారని హరీష్ బాబు వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి తాను అసెంబ్లీలో మాట్లాడిన విషయమై అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. కాళేశ్వరం కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈఈలు, డీఈలు రూ.వందల కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టారని, అధికారుల వద్దనే ఇంత అక్రమ సొమ్ము ఉంటే అప్పటి సీఎం కేసీఆర్ వద్ద ఇంకెంత అక్రమ సొమ్ము ఉంటుందోనని ఆయన ఆరోపించారు.