Chamala Kiran Kumar Reddy: బీఆర్ఎస్ నేతలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి కృష్ణా నదీ జలాల పంచాయితీని తేల్చకుండా బీఆర్ఎస్ నాయకులు గాడిద పళ్లు తోమారా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో గత ప్రభుత్వం తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేసిందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణా నది మన భూభాగంలో 69 శాతం ప్రవహిస్తుంటే, మొత్తం 812 టీఎంసీలలో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు చాలని కేసీఆర్, హరీశ్ రావు ఎందుకు అంగీకరించారని చామల కిరణ్ నిలదీశారు. అంతర్జాతీయ నీటి హక్కుల ప్రకారం తెలంగాణకు 500 టీఎంసీలకు పైగా వాటా రావాల్సి ఉన్నా, గత పాలకులు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. నాడు అన్యాయం జరుగుతుంటే హరీశ్ రావు సెంట్రల్ వాటర్ కమిషన్ ముందు ఎందుకు ధర్నా చేయలేదని ఆయన ప్రశ్నించారు.
కమీషన్ల కోసమే కొత్త ప్రాజెక్టులు
కాంగ్రెస్ హయాంలో, వైఎస్ఆర్ కాలంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కాలయాపన చేశారని ఎంపీ విమర్శించారు. పాత కాంట్రాక్టర్లు ఉంటే కమీషన్లు రావనే ఉద్దేశంతోనే కొత్త టెండర్లు పిలిచి ఖజానాను లూటీ చేశారని ఆరోపించారు. తుమ్మిడిహెట్టిని కాదని, కేవలం కమీషన్ల కోసమే గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని ఎద్దేవా చేశారు. దక్షిణ తెలంగాణలోని కృష్ణా ప్రాజెక్టులను పట్టించుకోకుండా ఇప్పుడు పాలమూరు-రంగారెడ్డి విషయంలో ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read: Harish Rao: కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకే బిల్లులు?.. హరీష్ రావు ఫైర్!
సెంటిమెంట్ పాలిటిక్స్ ఇక నడవవు
చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఒక్కటే అంటూ సెంటిమెంట్ రాజకీయాలతో లబ్ధి పొందాలని బీఆర్ఎస్ చూస్తుందని, కానీ ఆ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని చామల కిరణ్ అన్నారు. బనకచర్ల విషయంలో జనవరి 5వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ ఉన్నదని గుర్తు చేశారు. నీటి ప్రాజెక్టుల గురించి హరీష్ రావుకు ఒక్కడికే తెలుసు అన్నట్లు మాట్లాడటం సరికాదని, గత పదేళ్ల వైఫల్యాలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read: Alleti Maheshwar Reddy: కృష్ణా జలాలపై బీఆర్ఎస్ సెంటిమెంట్ రగిల్చే కుట్ర: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

