ఖమ్మం స్వేచ్ఛ: sri rama navami: దక్షిణ భారతదేశంలో శ్రీరామ నవమి అంటే మనకు గుర్తుకు వచ్చేది భద్రాచలం. అంతటి పుణ్య క్షేత్రం శ్రీరామ నవమి సమీపిస్తున్న వేళ వివాదాలతో వార్తల్లో నిలవడం భక్తులను క్షోభకు గురిచేస్తుందని చెప్పవచ్చు. మొన్నటికి మొన్న ముత్యాల తలంబ్రాలు పురుగుపట్టి పాడైపోయిన సంఘటన ఎందరినో కలచి వేసింది. దాదాపు ఐదు క్వింటాళ్ల తలంబ్రాల బియ్యం పురుగు పట్టిన సంగతి తెలిసిందే. లక్ష తలంబ్రాల ప్యాకెట్లలో ఉన్న ఆ బియ్యాన్ని భక్తులకు ఉచితంగా అందిస్తామని ఆలయ అధికారులు చెప్తున్నప్పటికి, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించకూడదనే వాదనలు వినిపిస్తున్నాయి.
గతంలో కూడా యాభై క్వింటాళ్ల బియ్యానికి పురుగు పడితే వాటిని పురుషోత్త పట్టణంలోని గోశాలలో పెద్ద గొయ్యి తవ్వి పాతి పెట్టారు. అంటే రాములోరి తలంబ్రాలకు పురుగు పట్టడం ఇప్పుడు కొత్తేమీ కాదు. అయినా సరే అధికారులు జాగ్రత్త పడలేదు అంటే వారి నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ముత్యాల తలంబ్రాలు అంటే
ముత్యాల తలంబ్రాలు అంటే పసుపు, కుంకుమ కలిపిన బియ్యం, రెండు ముత్యాలు ఒక చిన్న కవర్లో ప్యాక్ చేసి భక్తులకు ఇస్తారు. ఈ పాకెట్ విలువ 25 రూపాయలు వుంటుంది. శ్రీ రామనవమి సమయంలో ఈ ముత్యాల తలంబ్రాలను దేశ వ్యాప్తంగా భక్తులకు పోస్టు ద్వారా పంపిస్తుంటారు. ఇప్పుడు పాడైపోయినవి అలాంటి పాకెట్లే. గత ఏడాది భక్తులకు పంచకుండా, సరిగ్గా బద్రపరచకుండా అధికారులు పురుగుల పాలు చేశారు.
అధికారులు Vs అర్చకులు
అర్చక బృందానికి, ఆలయ అధికారులకు మధ్య వివాదం ముదురుతోంది. హోళీ పండుగ రోజు జరగాల్సిన అంకురార్పణ కార్యక్రమం మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమవడానికి కారణం ఈ వివాదమే. ఉగాది రోజు జరగాల్సిన కార్యక్రమాలు కూడా ఆలస్యం అయినవి. ఇంత జరుగుతున్న ఈఓ పరిస్థితినీ అదుపులోకి తీసుకురాలేక పోవడం శోచనీయం. అధికారులకు, అర్చకులకు మధ్య సమన్వయం లేదు అనే విషయం శ్రీ రామనవమి ఏర్పాట్లలో బట్టబయలు అయింది. చివరికి కలెక్టర్ కలుగ చేసుకునే వరకూ వచ్చిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
Also Read: Minister Komatireddy Venkat Reddy: హిందూ ముస్లింల సమైక్యతతోనే అభివృద్ధి సాధ్యం: మంత్రి కోమటిరెడ్డి
ఈనెల 6 తారీకున స్వామివారి కళ్యాణం, ఏడవ తేదీన మహా పట్టాభిషేకం జరగనున్న నేపథ్యంలో, పనుల పర్యవేక్షణకు వెళ్ళిన కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కళ్యాణ పనుల ఆలస్యంపై మరియు వివిఐపీల ప్లేస్ సర్దుబాటుపై ఆలయ అధికారులపై సీరియస్ అయ్యారు. ఒక ప్లాన్ ఇస్తే మరొక ప్లాన్ చేశారంటూ ఆలయ ఈవో రమాదేవి, ఈ ఈ రవీంద్ర రాజు లను వివరణ అడిగారు. సుప్రీంకోర్టు జడ్జిలు, యూనియన్ మినిస్టర్, ముఖ్యమంత్రి. వంటి ప్రముఖులను ఎక్కడ కూర్చోబెడతారంటూ కలెక్టర్ జీతేష్ వి పాటిల్ వారి పై మండి పడ్డారు.
వివాదం ఏంటి
రామాలయంలో ఉప ప్రధాన అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస రామానుజంను ఆలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు క్రమ శిక్షణ చర్యలలో భాగంగా ఈ ఓ రమాదేవి పర్ణశాల రామాలయానికి బదిలీ చేశారు. ఏప్రిల్ 6 న జరగబోయే శ్రీరామనవమి వేడుకల్లో శ్రీనివాస రామానుజం కీలక పూజలు చేయాల్సి ఉంది. ఎన్నో ఏళ్లుగా ఈ తంతు ఆయన చేతుల మీదుగా జరుగుతుంది. కావున శ్రీరామనవమి వరకూ ఆయన్ను బదిలీ చేయకుండా ఆపాలని అర్చకులు ఈ ఓ ను కోరగా, ఆమె నిరాకరించారు. రామానుజం లేకుండా పూజలు చేయబోమని అర్చకులు మొండి పట్టు పడుతున్నారు.
ఈ వివాదం పై దేవాదాయ కమీషనర్ హరీష్ కమిటీ వేశారు. నలుగురు సభ్యుల కమిటీ అధికారులను, అర్చకులను కూర్చోబెట్టి మాట్లాడి నివేదికను అందచేసింది. అటు అర్చకులు, ఇటు అధికారుల మొండి వైఖరి కారణంగానే పూజా కార్యక్రమాలు, ఏర్పాట్లు ఆలస్యం అవుతున్నాయనేది అందరికీ తెల్సిన విషయమే. ఇప్పటికైనా ఇరు వర్గాలు సహనంతో ఉండి ఒకరికి ఒకరు సహకరించుకోకపోతే, శ్రీరామనవమి రోజు సీఎమ్ ముందు నవ్వుల పాలు అవ్వాల్సి వస్తుందని భద్రాద్రి వాసులు అభిప్రాయపడుతున్నారు.