Bandi Sanjay: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హిందూ, ముస్లింల మధ్య జరుగుతున్న వార్ అని, మొలతాడు ఉన్నోళ్లకు, లేనోళ్లకు మధ్య పోటీ జరుగుతున్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా రహమత్ నగర్(మీనాక్షిపురం) చౌరస్తా వద్ద శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఈ ఎలక్షన్ బొట్టు పెట్టుకున్నోళ్లకు, బొట్టు లేనోళ్లకు మధ్య జరుగుతున్నదన్నారు. 80 శాతం ఉన్న హిందువులు గెలుస్తారా? 20 శాతం ఉన్న ముస్లింలు గెలుస్తారా? చూడాలన్నారు. హిందువుల పక్షాన బీజేపీ ఉన్నదని, ముస్లింల పక్షాన కాంగ్రెస్ ఉన్నదన్నారు. ప్రజలకు ఖాన్ బేగం నగర్ కావాలా? సీతారాం నగర్ కావాలో తేల్చుకోవాలన్నారు.
మసీదులుగా మారిపోతాయి..
తెలంగాణను ఇస్లామిక్ స్టేట్‌గా మార్చేందుకే కుట్ర చేస్తున్నారని బండి విమర్శించారు. బీజేపీని గెలిపిస్తే బంజారాహిల్స్‌లో పెద్దమ్మ తల్లి గుడిని కట్టిస్తానని, అమిత్ షాను పిలిపించి కొబ్బరికాయ కొట్టిస్తానని సంజయ్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గెలిస్తే పార్కులు ఖబరస్తాన్‌లు, ఈద్గా, మసీదులుగా మారిపోతాయని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ హిందువుల్లో పౌరుషం ఉంటే ఓటు బ్యాంకుగా మారాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే జూబ్లీహిల్స్‌ను సీతారాం నగర్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బండి సంజయ్ సంగతి చూస్తానని ట్విట్టర్ టిల్లు అంటున్నారని ఫైరయ్యారు. ఆయన తండ్రి కేసీఆరే ఏమీ చేయలేకపోయారని, కేటీఆర్ ఏం చేస్తారని విమర్శించారు. తనపై 109 కేసులు పెట్టినప్పుడే భయపడ లేదని, తన కొడుకుపైనా కేసు పెట్టి వేధించారని, తన భార్యను ఇబ్బంది పెట్టారని పేర్కొన్నారు. తనను చంపుతానన్నా హిందుత్వం కోసమే పోరాడతానని పేర్కొన్నారు.
Also Read: DCC Presidents: తుది దశకు చేరిన ఏఐసీసీ కసరత్తు.. ఈ జిల్లాలో డీసీసీ పదవిపై ఉత్కంఠ!
చివరి చూపు కూడా..
ఓట్ల కోసం టోపీ పెట్టుకుని అడుక్కునే బిచ్చపు బతుకు తనది కాదని, తన టోపీ ఆరెంజ్ కలర్ అని చెప్పారు. డబ్బులు ఎవరిచ్చినా తీసుకోవాలని, ఓట్లు మాత్రం బీజేపీకే వేయాలని బండి కోరారు. ఇక, మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులు తన వద్దకొచ్చి ఏడుస్తున్నారని పేర్కొన్నారు. కన్నతల్లిని తల్లి కాదని, పెళ్లి చేసుకున్న భార్యను భార్యే కాదని, కన్న బిడ్డను కూడా కొడుకు కాదని వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్న కొడుకును చివరి చూపు కూడా చూడనీయని నీచులు బీఆర్ఎస్ నేతలంటూ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతల దృష్టి అంతా మాగంటి ఆస్తిపాస్తులపైనే ఉన్నదన్నారు. ఆయన ఆస్తి పత్రాలను మార్చి దోచుకోవాలనుకున్నారని వ్యాఖ్యానించారు. నెల క్రితమే మాదాపూర్‌లో మాగంటి కొడుకు తారక్ ఫిర్యాదు చేశారని, అయినా ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు.
Also Read; Mega Heroes: మెగా నామ సంవత్సరం మొదలైనట్టేనా? అంతా మెగా జపమే!
