Telangana BJP President: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. వచ్చే నెలలో కమల దళపతి నియామకం ఉండే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అన్నీ ఒకే అయితే జూలై రెండో వారంలో అధ్యక్షుడి ప్రకటన ఉండే అవకాశం ఉందని ఇటీవల రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ మీడియాకు వెల్లడించారు. అయితే, ఇప్పటికే పలుమార్లు అధ్యక్షుడి ప్రకటన వాయిదాపడుతూ వస్తున్నది. ఆదివారం నిజామాబాద్‌కు కేంద్ర మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ పర్యటన తర్వాత స్టేట్ చీఫ్ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కమలనాథులు చెబుతున్నారు. త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలకు ముందు అధ్యక్ష మార్పు చేసేందుకు బీజేపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్టేట్ చీఫ్ రేసులో పలువురు నేతలున్నారు. వారంతా తమకే వస్తుందని ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. ఇదిలా ఉండగా ఒకేసారి 10 రాష్ట్రాలకు అధ్యక్షులను ప్రకటించేందుకు కాషాయ పార్టీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. పది రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటిస్తే జాతీయ అధ్యక్షుడి ఎంపికకు ఎలిజిబులిటీ రానుంది. ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడిన స్టేట్ చీఫ్ అంశానికి ఈసారైనా అనౌన్స్ చేసి లైన్ క్లియర్ చేస్తారా? లేదంటే మరోసారి బ్రేక్ వేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం
తెలంగాణకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 29న రానున్నారు. ఆదివారం ఉదయం 11.25 గుజరాత్ అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి మధ్యాహ్నం 1 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు షా చేరుకుంటారు. మధ్యాహ్నం 1:45 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయానికి అమిత్ షా చేరుకుని అక్కడి నుంచి జాతీయ పసుపు బోర్డు కార్యాలయానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి 2:30 వరకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలోనే షా ఉండనున్నారు. 2:35కు నిజామాబాద్ కంఠేశ్వరం క్రాస్ రోడ్ లో ఏర్పాటుచేసిన డీ శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆపై 2:45 నిమిషాల నుంచి 4 గంటల వరకు పాలిటెక్నిక్ గ్రౌండ్‌లో జరిగే కిసాన్ మహాసభలో కేంద్ర మంత్రి పాల్గొంటారు. ఆ సభ అనంతరం సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని 5:30కి ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.
Also Read: Nagarjuna Sagar: సాగర్ డ్యామ్‌పై లొల్లి.. ఏపీ, తెలంగాణ ఉద్యోగుల మధ్య వాగ్వాదం.. ఎందుకంటే?
ముఖ్య నేతలతో షా భేటీ
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 5:30 వరకు ఈ భేటీ జరగనుంది. త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనా పార్టీలో చర్చ జరుగుతోంది. సరైన అభ్యర్థి కోసం పార్టీ తలమునకలై ఉంది. అంతేకాకుండా స్టేట్ చీఫ్ అంశంపై సైతం ఈ మీటింగులో చర్చలోకి వచ్చే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం. కాగా, వాటికి సంబంధించిన పలు కీలక అంశాలపై అమిత్ షా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. అధ్యక్షుడి ప్రకటనకు ముందు అమిత్ షా ముఖ్య నేతలతో భేటీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.