Nagarjuna Sagar: నాగార్జునసాగర్ డ్యాంపై తెలంగాణ, ఏపీ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. డ్యాంను తమకు అప్పగించాలని ఏపీ పట్టుబట్టడంతో తెలంగాణ అధికారులు సైతం స్పందించి ధీటుగా సమాధానం ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఉద్యోగుల ఇన్సెంటివ్స్‌పై స్పెషల్ మీటింగ్ నిర్వహించారు. వర్చువల్ విధానంలో ఏపీ, తెలంగాణ అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో సాగర్ డ్యామ్ యాజమాన్య నిర్వహణ అంశంను తెలంగాణ అధికారులు ప్రస్తావించారు. విభజన చట్టం ప్రకారం కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు నిర్వహిస్తున్నా, శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌ను తెలంగాణ నిర్వహించాల్సి ఉంది. శ్రీశైలం ఏపీ ఆధీనంలోనే ఉంది. సాగర్ డ్యామ్‌పై ఏపీ వితండవాదం చేస్తుంది. అంతేకాదు ఏపీ తీరుతో కేంద్రం సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించిన విషయం తెలిసిందే. సాగర్ డ్యాంను తెలంగాణకు అప్పగించాలని కృష్ణా బోర్డు మీటింగులలో కోరుతున్నారు. ఈ మీటింగ్‌లోనూ డ్యామ్‌ను తెలంగాణకు అప్పగించాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఏపీ మాత్రం అప్పగించేది లేదంటూ చెప్పడంతో పాటు తామే నిర్వహిస్తామని, తమ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్)ను పెట్టుకుంటామని బోర్డు ముందు వాదించింది. దీంతో తెలంగాణ అధికారులు ఏపీకి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. విభజన చట్టం ప్రకారం శ్రీశైలం డ్యామ్ ఏపీ చేతుల్లో ఉన్నప్పుడు, సాగర్ ప్రాజెక్టు నిర్వహణ తెలంగాణనే కదా చూడాల్సిందని బోర్డుకు వివరించారు. తెలంగాణ ప్రతిపాదనకు తొలుత కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్ స్పందించారు. సాగర్ డ్యామ్ నిర్వహణను తెలంగాణనే చూసుకోవాల్సి ఉంటుంది కదా అన్నారు. ఏపీ అధికారులు జోక్యం చేసుకుని అదెలా సాధ్యమని అడ్డుకున్నారు. ఎస్పీఎఫ్కు ఇవ్వకపోయినా, ప్రస్తుతం సీఆర్పీఎఫ్ అధీనంలోనే ఉందని దానినే కొనసాగించాలని బోర్డును కోరారు. దీనికి బోర్డు చైర్మన్ కూడా దానికి అంగీకరించారు.
Also Read: Raghunandan on Kavitha: నన్నెందుకు విచారణకు పిలవడం లేదు.. ఎంపీ రఘునందన్ రావు
డిసెంబర్ 30 వరకు సాగర్ ప్రాజెక్ట్ నిర్వహణ సీఆర్పీఎఫ్ అధీనంలోనే ఉంటుందని, అప్పటి వరకూ అదే కొనసాగుతుందని బోర్డు చైర్మన్ పేర్కొన్నారు. తెలంగాణకు సాగర్ ప్రాజెక్టును అప్పగిస్తే తమ ఆటలు సాగవనే ఏపీ అడ్డుకుంటుందని అధికారులు కుట్రలకు పాల్పడుతున్నారనేది స్పష్టమవుతున్నది. అయితే, బోర్డులో పనిచేస్తున్న తెలంగాణ, ఆంధ్ర ఉద్యోగులకు ఇకపై స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇవ్వొద్దని సమావేశంలో నిర్ణయించారు. కేంద్ర జలశక్తిశాఖ గైడ్‍లైన్స్, హైకోర్టు ఆదేశాలపై భేటీలో చర్చించారు. ఇప్పటికే ఇచ్చిన ఇన్సెంటివ్స్ను రికవరీ చేయాలని కేంద్రం ఆదేశాలివ్వగా, రికవరీ చేయాల్సిన అవసరం లేదని నిర్ణయించినట్టు అధికారులు పేర్కొంటున్నారు.