RTA Corruption: రవాణా శాఖలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు (ఏఓలు) అత్యంత కీలకంగా మారారు. ఆర్టీవో కార్యాలయాల్లో యూనిఫామ్ సిబ్బంది ఉన్నప్పటికీ, వారిని సైతం తమ ఆధీనంలోకి తెచ్చుకొని ఏఓ(AO)లే చక్రం తిప్పుతున్నారు. ఎవరైనా దీన్ని ప్రశ్నిస్తే, ఉన్నతాధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేయడంతో పాటు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కిందిస్థాయి సిబ్బందికి టార్గెట్లు విధించి, వారి నుంచి చేతివాటం ప్రదర్శిస్తున్నారని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. శాఖపై వస్తున్న అవినీతి ఆరోపణలను తగ్గించాలంటే, ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి ఈ ఏఓలపై కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ సిబ్బంది, అధికారులు డిమాండ్ చేస్తున్నారు.
చెక్ పోస్టులు ఎత్తేయడంతో..
శాఖలో అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రక్షాళన ప్రారంభించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ప్రత్యేక దృష్టి సారించి చెక్ పోస్టులను ఎత్తేయడంతో పాటు, మధ్యవర్తుల ప్రమేయం తగ్గించేందుకు వాహన షోరూమ్‌లలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అయినప్పటికీ, ఆర్టీఏ కార్యాలయాల్లో ఏఓల ఆధిపత్యం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వారు తమకు కేటాయించిన అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలను వదిలి.. వాహన రిజిస్ట్రేషన్లు, ఎల్లో ప్లేట్ జారీ, ట్రాన్స్‌ఫర్ ఓనర్ షిప్, డ్రైవింగ్ లైసెన్సుల జారీ వంటి ప్రతి అంశంలోనూ జోక్యం చేసుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయ ఉద్యోగులకు సైతం టార్గెట్లు పెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో శాఖలో కలకలం రేగుతోంది.
తీవ్ర ఆరోపణలతో..
రాష్ట్రంలోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో ఆర్టీవో పోస్టులు ఖాళీగా ఉండటంతో, ప్రభుత్వం అక్కడ పనిచేస్తున్న ఏఓలకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తోంది. అయితే దీనిని ఆసరాగా తీసుకుని వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాన్స్‌ఫర్ ఓనర్ షిప్, హైపోథికేషన్ టర్మినేషన్, ఆర్సీలు, ఎల్లో ప్లేట్లకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేసే అధికారం రావడంతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనగామ, హైదరాబాద్ జేటీసీ పరిధిలోని కొందరు ఏఓలపై అవినీతి ఆరోపణలు రావడంతో, ఉన్నతాధికారులు విచారణ జరిపి వారిని ఎస్టీఏ కార్యాలయానికి అటాచ్ చేశారు. హైదరాబాద్ జేటీసీ పరిధిలోని ఒక కార్యాలయంలో ఆర్టీవో శిక్షణకు వెళ్లిన సమయంలో, ఇన్చార్జి బాధ్యతలు తీసుకున్న ఇద్దరు ఏఓలపై తీవ్ర ఆరోపణలు రావడం రవాణా శాఖలో వారి ఆధిపత్యానికి అద్దం పడుతోంది.
Also Read: GHMC Politics: జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు ముగియక ముందే మొదలైన పాలిటిక్స్
ఎవ్వరినీ వదల్లేదుగా!
రవాణా శాఖ కార్యాలయంలో ఏఎంవీఐ, ఎంవీఐ, ఆర్టీవో వంటి యూనిఫామ్ స్టాఫ్ ఉన్నప్పటికీ, ఏఓలు వారిని సైతం బెదిరింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం. ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేయడం, రెండేళ్లకోసారి జరగాల్సిన బదిలీలు పైరవీలతో ఆగిపోవడం వీరి అవినీతికి ప్రధాన కారణమని విమర్శలు వస్తున్నాయి. బదిలీపై కొత్తగా వచ్చే అధికారులను సైతం తమ ఆధీనంలోకి తీసుకుని, కార్యాలయాన్ని మొత్తం తమ కనుసన్నల్లో నడిపిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, యూనిఫామ్ సిబ్బందిని సైతం శాసిస్తున్న ఏఓల తీరుపై శాఖలో అంతర్గత చర్చ జోరుగా సాగుతోంది.
ఇంతకీ చర్యలుంటాయా?
ఏఓలు తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో పనిచేస్తున్న పలువురు ఏఓలపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ఆర్టీవో కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని ఫిర్యాదులు అందుతున్నాయి. కార్యాలయ సిబ్బందికి ఒక్కొక్కరికి ఒక టార్గెట్ విధించి, ప్రతిరోజూ వారి నుంచి నిర్బంధంగా వసూళ్లకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. సిబ్బందిని మానసిక ఆందోళనకు గురి చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఈ అధికారుల తీరుపై శాఖలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏఓల వేధింపులు భరించలేక పోతున్నామని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు. ఈ ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో ఇప్పటికైనా రవాణా శాఖ ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారా? లేదా? అనేది వేచి చూడాలి.
Also Read; Kavitha – PK Alliance: కవిత కొత్త పార్టీ.. రంగంలోకి రాజకీయ వ్యూహాకర్త పీకే.. వర్కౌట్ అయ్యేనా?

