GHMC Politics: ఆశావాహుల ముందస్తు ప్రయత్నాలు
జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు
వార్డుల సరిహద్దులు, ఓటు బ్యాంక్‌పై నేతల కసరత్తు
మునిసిపాలిటీల ఆశావాహుల దరఖాస్తుల సేకరణకు ఎంఐఎం సిద్దం
అధికార, విపక్ష పార్టీల టికెట్ల కోసం ప్రయత్నాలు షురూ
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: జీహెచ్ఎంసీ పాలక మండలి అధికార గడువు త్వరలోనే ముగియనున్నందున ఆ తర్వాత జరిగే ఎన్నికల కోసం సిటీలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఆశావహులు కాస్త ముందు నుంచే ప్రయత్నాలు (GHMC Politics) మొదలు పెట్టారు. ముఖ్యంగా కొద్ది రోజుల ముందు జరిగిన పంచాయతీ ఎన్నికలు, త్వరలోనే మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు ఎన్నికలకు సన్నాహాలు జరుగుతుండటం, మరో వైపు వచ్చే నెల 10వ తేదీ జీహెచ్ఎంసీ పాలక మండలి అధికార గడువు ముగుస్తుండటంతో త్వరలోనే తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారన్న సమాచారం మేరకు వివిధ పార్టీలకు చెందిన ఆశావాహులు, నేతలతో పాటు త్వరలోనా తాజా మాజీ కార్పొరేటర్లు కానున్న ప్రస్తుత పాలక మండలి సభ్యులు సైతం ఎన్నికలకు సిద్దమవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సారి జీహెచ్ఎంసీలోకి తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయటంతో వార్డుల సంఖ్య రెండింతలై 300 లకు పెరిగిన సంగతి తెల్సిందే.
Read Also- Chiranjeevi: వింటేజ్ మెగాస్టార్‌ని చూసేందుకు తరలివస్తున్న ఫ్యాన్స్.. వైరల్ అవుతున్న లేఖలు!
మున్సిపల్ వార్డుల పునర్విభజనతో సరిహద్దులు పూర్తిగా మారియపోయి. ఈ సమాచారాన్ని అప్పటికే జీహెచ్ఎంసీ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచటంతో కార్పొరేటర్ టికెట్ ఆశిస్తున్న వివిధ పార్టీలకు చెందిన నేతలు, మాజీ కార్పొరేటర్లు, త్వరలో మాజీ లు కానున్న పలువురు కార్పొరేటర్లు రూపురేఖలు మారిన తమ వార్డుల సరిహద్దులు, అందులోని వివిధ సామాజికవర్గాల వారీగా తమ ఓటు బ్యాంక్ లను వెతుక్కునే పనిలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్, విపక్షం బీఆర్ఎస్ తో పాటు ఎంఐఎం పార్టీలకు చెందిన ఆశావాహులు ఇప్పటి నుంచే పలు సందర్భాలను పురస్కరించుకుని భారీగా ఫ్లెక్సీలు వంటి ఏర్పాటు చేసుకుని ఫ్రీ ప్రచారాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు నిర్వహించే ప్రక్రియలో భాగంగా రెండు రోజుల క్రితం రిజర్వేషన్లను ఖరారు చేయటంతో వాటిని అనుసరించి, ఆయా సామాజికవర్గాలకు చెందిన ఆశావాహులు, మాజీ మేయర్లు, మాజీ డిప్యూటీ మేయర్లు, కౌన్సిలెర్లు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయంలో ఎంఐఎం మరో అడుగు ముందుకేసి మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల పరిధిలో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను కూడా షురూ చేసింది.
సామాజికవర్గానికి చెందిన ఓట్లపైనే కసరత్తు
ప్రస్తుతం జీహెచ్ఎంసీ రూపాంతరం చెందిన తర్వాత ఏర్పడిన 300 మున్సిపల్ వార్డులకు సంబంధించి జీహెచ్ఎంసీ అందుబాటులో ఉంచిన మ్యాప్ లు, సరిహద్దులను బట్టి వివిధ పార్టీలకు చెందిన ఆశావాహులు, నేతలు, మాజీ కార్పొరేటర్లు, గతంలో పోటీ చేసి అపజయం పాలైన నేతలు తమ సామాజికవర్గానికి చెందిన ఓట్లు వార్డులో ఎక్కడెక్కడ ఉన్నాయి? తమకు ఎంత వరకు కలిసొస్తాయన్న విషయంపైనే లోతుగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు వార్డు సరిహద్దులను గుర్తించి, ఏఏ ప్రాంతాల ఓటర్లు తమను ఆదరిస్తారన్న విషయాలపై అంచనాలేస్తున్నారు. రూపురేఖలు పూర్తి గా మారిన వార్డులలోకి ఏఏ ప్రాంతాలు కలిశాయి? ఏఏ ప్రాంతాలు పక్క వార్డులోకి వెళ్లాయన్న విషయంపై ఆయా పార్టీలకు చెందిన నేతలు అవసరమైతే సీనియర్లను ఆశ్రయించి సూచనలు, సలహాలను తీసుకోవటంలో బిజీగా ఉన్నారు. మరి కొందరు జీహెచ్ఎంసీ ని మూడు కార్పొరేషన్లు చేసిన తర్వాత తాము ఏ కార్పొరేషన్ పరిధిలోకి వస్తామోనంటూ మరి కొందరు వేచి ఉన్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలోని గత 150 వార్డుల్లో మాత్రం త్వరలో మాజీలు కాబోయే కార్పొరేటర్లే పోటీ చేసే అవకాశాలున్నప్పటికీ, వీటిలో విపక్షాలకు చెందిన పలువురు కార్పొరేటర్లు అధికార కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లు తెలిసింది. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు చాలా కాలంగా రాజకీయాల్లో కొనసాగుతూ ఇపుడు కార్పొరేటర్ టికెట్ ను ఆశిస్తున్నట్లు, కాంగ్రెస్ పార్టీ కేటాయించని పక్షంలో ప్రత్యామ్నాయంగా ఇతర పార్టీలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా తెలిసింది.

