Fertility Centers: ఫెర్టిలిటీ సెంటర్లపై సర్కార్ చర్యలు మొదలు పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 12 కీలక కేంద్రాలపై యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోగా, మూడు కేంద్రాలను పూర్తిగా సీజ్ చేశారు. మరో పది కేంద్రాల్లో కొద్ది రోజుల పాటు పూర్తిగా సేవలు నిలిపివేయాలని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ సంగీతా సత్యనారాయణ(Commissioner Dr. Sangeeta Satyanarayana) ఆదేశాలు జారీ చేశారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్(Shrishti Fertility Center) ఇష్యూ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైద్యారోగ్యశాఖ రెయిడ్స్ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 381 ఫెర్టిలిటీ కేంద్రాలపై వైద్య ఆరోగ్యశాఖ తనిఖీలు చేయగా, వాటిలో నిబంధనలు పాటించని 50కు పైగా కేంద్రాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. ఫెర్టిలిటీ కేంద్రాల నిర్వాహకులు కమిషనర్ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని సూచించారు. అయితే ఆయా మేనేజ్‌మెంట్లు వివరణ ఇచ్చినా.. వైద్యారోగ్యశాఖ టీమ్ సంతృప్తి చెందలేదు. దీంతో చర్యలను ప్రారంభించింది.
Also Read: Hidma Encounter: భారీ ఎన్ కౌంటర్.. కరుడుగట్టిన మావోయిస్టు హిడ్మా హతం
నిర్లక్ష్యం స్పష్టంగా..?
ఇక గతంలో కేంద్రాలపై తనిఖీలు చేసిన సమయంలోనే రెయిడ్స్ టీమ్ ప్రత్యేకంగా రిమార్క్ నోట్ చేసింది. ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి నివేదికలో పొందుపర్చింది. చాలా కేంద్రాల్లో ఒక డాక్టర్ పేరుతో అనుమతి పొంది, ఆ డాక్టర్ లేకుండానే వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. చాలా కేంద్రాల్లో ధరల పట్టిక, డాక్టర్ల పేర్లు కూడా ప్రదర్శించడం లేదని తేలింది. అంతేకాకుండా, రేడియాలజిస్టులు, ఎంబ్రియాలజిస్టులు వంటి కీలక నిపుణులు లేకుండానే సెంటర్లు నడుపుతున్నట్లు వెల్లడైంది. కొన్నిచోట్ల అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. గర్భిణీలకు చేసే స్కానింగ్ వివరాలను ప్రభుత్వానికి తెలపక పోవడం వంటి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. ఇక గర్భిణీలకు చేసే ప్రతీ స్కానింగ్ వివరాన్ని వైద్య శాఖకు పంపాలి. కానీ కొన్ని కేంద్రాలు ఆ వివరాలేవి పంపడం లేదని గుర్తించారు. ఇలా నిబంధనలు ఉల్లంఘించిన వాటికి గతంలో నోటీసులు ఇచ్చి.. ఇప్పుడు చర్యలు మొదలు పెట్టడం గమనార్హం. అసిస్టెడ్ రీ ప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) యాక్ట్ 2021, సరోగసీ (రెగ్యులేషన్) చట్టం 2021 నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. త్వరలో మరో సారి రెయిడ్స్ ఉండే అవకాశం ఉన్నట్లు ఓ కీలక అధికారి తెలిపారు.
Also Read: Dasoju Sravan: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అనర్హత వేటు తప్పదు: ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
