Hidma Encounter: అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ప్రాణాలు కోల్పోయాడు. ఆయన భార్య సహా మరో ఇద్దరు కీలక నేతలను సైతం భద్రతా బలగాలు మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. హిడ్మాతో కలిపి మెుత్తం ఆరుగురు మావోయిస్టులు.. ఈ ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మావోయిస్టుల అగ్రనేతగా ఉన్న హిడ్మా కోసం ఎంతో కాలంగా భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. ఈ క్రమంలో అతడిపై ఏకంగా రూ.కోటి రివార్డును సైతం పోలీసులు ప్రకటించారు. ఆయన భార్యపై కూడా రూ.50 లక్షల రివార్డ్ ఉంది. హిడ్మా వంటి కీలక నేతను మట్టుబెట్టడం ద్వారా మావోయిస్టులపై మరో కీలక విజయాన్ని భద్రతా బలగాలు సాధించగలిగాయి.
పక్కా సమాచారంతో కూంబింగ్..
అంతకుముందు మరేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో అక్కడకు చేరుకున్న బలగాలపైకి ఒక్కసారిగా మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన బలగాలు.. ఎదురుకాల్పులకు దిగాయి. తద్వారా హిడ్మా, ఆయన భార్య సహా మరో నలుగురిని మట్టుబెట్టారు. హిడ్మా ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఉన్నతాధికారులు మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి చేరుకుంటున్నారు. హిడ్మా ఎన్ కౌంటర్ కు సంబంధించి కాసేపట్లో పోలీసు ఉన్నతాధికారులు మీడియా సమావేశం నిర్వహించే అవకాశముంది.
ఏపీ డీజీపీ రియాక్షన్
మరోవైపు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఎదురుకాల్పుల గురించి ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్పందించారు. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్లు తనకు సమాచారం ఉందని చెప్పారు. వారిలో హిడ్మా తో పాటు ఆయన భార్య కూడా మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఉదయం 6 – 7 గంటల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగతున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోల కదలికలపై సమాచారమున్నట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా చెప్పుకొచ్చారు.
హిడ్మా ఎవరంటే?
హిడ్మా విషయానికి వస్తే.. ఆయన 1981లో చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పుర్వతి గ్రామంలో జన్మించారు. 10వ తరగతి వరకు చదువుకున్న తర్వాత 1990ల చివరలో మావోయిస్ట్ ఉద్యమంలో చేరాడు. తొలినాళ్లలో పీపుల్స్ లిబరేషన్ గెరిలా ఆర్మీ (PLGA) బటాలియన్ లో కమాండర్‌గా పనిచేశారు. ఆ తర్వాత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) సభ్యుడిగా, సెంట్రల్ కమిటీలో అతి పిన్ని సభ్యుడిగా పదవి పొందాడు. సుక్మా, బిజాపూర్, దంతేవాడ జిల్లాలలోని మావోయిస్ట్ కార్యకలాపాల్లో అతడు ముఖ్య భూమిక పోషించాడు.
26 దాడులకు మాస్టర్ ప్లాన్
2004 నుంచి ఇప్పటివరకూ జరిగిన 26 దాడులకు హిడ్మా మాస్టర్ మైండ్ గా పనిచేశాడు. 200 మందికి పైగా భద్రతా బలగాల మరణాలకు అతడు కారణమయ్యాడు. ముఖ్యంగా 2021 బిజాపూర్ జరిగిన భారీ దాడి వెనుక హిడ్మా పాత్ర ఉంది. STF, DRG, CRPF బృందాలపై మావోలు జరిపిన మెరుపు దాడిలో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో అప్పట్లో హిడ్మా పేరు పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది. దీంతో అతడ్ని పట్టుకునేందుకు దాదాపు 2000 మందితో కూడిన బృందాలను ఉన్నతాధికారులు రంగంలోకి దింపినట్లు సమాచారం. అటువంటి హిడ్మాను తాజాగా మట్టుబెట్టడం ద్వారా మావోయిస్టులపై పోలీసులు అతి భారీ విజయాన్ని సాధించారని చెప్పవచ్చు.
