Arjun Ram Meghwal: అడ్వకేట్ రక్షణ చట్టం చాలా ముఖ్యమైందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్(Minister Arjun Ram Meghwal) తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ లీగల్ సెల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక న్యాయ సంబంధిత అంశాలపై చర్చ జరిగింది. అనంతరం కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మాట్లాడుతూ.. అడ్వకేట్ల రక్షణకు సంబంధించిన అంశంపై తనకు పలుమార్లు వినతులు అందినట్లు చెప్పారు. దేశంలో డాక్టర్లు, అడ్వకేట్లకు చాలా డిమాండ్ ఉందన్నారు. సుప్రీంకోర్టులో ఎన్నో కేసులున్నాయని, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించిన కేసులు కూడా సైతం ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
తెలంగాణలో బీజేపీ అధికారం
అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేయాలని వివరించారు. కేంద్రం పాలసీలకు అనుగుణంగా కోర్టుల్లో మనం వాదిస్తామనేది కీలకమని తెలిపారు. రానున్న మూడేళ్లు ఎంతో కీలకమని వివరించారు. అందుకు ప్రత్యేకమైన శిక్షణ తరగతులు నిర్వహించాల్సిన అవసరముందని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ స్టాండ్ బలంగా వినిపించేందుకు ఎఫర్ట్ పెట్టాలని కోరారు. తెలంగాణలో బీజేపీ(BJP) అధికారంలోకి రావాలంటే అందరూ కలసికట్టుగా పనిచేయాలని కేంద్ర మంత్రి సూచించారు. అర్జున్ రామ్ మేఘ్వాల్ ఐఏఎస్ గా ఉన్నప్పటికీ రాజీనామా చేసి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగారన్నారు. ప్రతి శాఖలో అనేక రిఫార్మ్స్ తీసుకువస్తున్నామని, కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని వివరించారు. అందుకే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే మూడేళ్లు కీలకమని తెలిపారు. బ్రిటీష్ చట్టాలు ఇప్పటికీ అమలవుతున్నాయని, వర్తమాన ప్రజల ఆలోచనలకు అనుగుణంగా చట్టాలు తేవాలనేది ప్రధాని మోడీ ఆలోచనగా చెప్పుకొచ్చారు.
Also Read: Sree Vishnu: మరో సినిమా ప్రారంభించిన హీరో శ్రీ విష్ణు.. వారి కాంబోలో ఇది రెండో చిత్రం
మోడీ కాలం చెల్లిన చట్టాలు..
రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ కాలం చెల్లిన చట్టాలు రద్దు చేశారన్నారు. దేశాన్ని ఆర్థికంగా విచ్ఛిన్నం చేసేందుకు ఇతర దేశాలు కుట్రలు పన్నుతున్నాయని పేర్కొన్నారు. మోడీ విజనరీ లీడర్ కాబట్టి సూక్ష్మంగా స్పందిస్తున్నారని కొనియాడారు. అగ్రదేశాలు అడ్డగోలు టారిఫ్ లతో భారతదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలని చూస్తున్నాయని, భారత్ ఎదుగుదలను చాలా దేశాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. స్వదేశీ వస్తువులు వినియోగించడం ద్వారా.. మన ఆదాయం ఇతర దేశాలకు వెళ్లకుండా ఉంటుందని, తద్వారా పెట్టుబడులు పెరిగి ఇతరులకు ఉపాధి కూడా దొరుకుతుందన్నారు.
గత చట్టాలను రద్దు చేసి..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchende Rao) మాట్లాడుతూ.. త్వరిగతిన న్యాయం దక్కాలని గత చట్టాలను రద్దు చేసి.. భారత న్యాయ సంహిత చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చిందన్నారు. హైదరాబాద్(Hyderabad) నడి రోడ్డుపై న్యాయవాది దంపతులను నరికి చంపారని, కేసు వెనక్కి తీసుకోకపోతే ఆ కేసు వేసిన వారిని హత్య చేశారని గుర్తుచేశారు. దీనిపై సీబీఐ(CBI) దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. న్యాయవాదులకు భద్రత కల్పించే చట్టాలు రావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar Reddy), రఘునందన్ రావు(Raghunandan Rao), బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ రామారావు(Ramarao), తెలంగాణ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నర్సింహా రెడ్డి, ఉపాధ్యక్షుడు సునీల్ గౌడ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Comrade Kalyan Title Teaser: హీరో శ్రీ విష్ణు ఈ టైటిల్ టీజర్ చూశారా.. ఏంటి భయ్యా అలా మారిపోయావ్..
