Wildness Resort: రిసార్ట్ పేరుతో కొందరు ప్రైవేట్ దందాను నడిపిస్తున్నారు. ఎటువంటి అనుమతులు పొందకుండానే బోటింగ్ నిర్వహిస్తున్నారు. రాజకీయ అండదండలతో రూ.కోట్లలో నిర్వాహకులు సొమ్ము చేసుకుంటుండగా, భద్రతకు భరోసా లేక పర్యాటకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. (Vikarabad District) వికారాబాద్ జిల్లాలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే అడ్డూ అదుపు లేకుండా రిసార్ట్స్ దందా సాగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ యథావిధిగా అక్రమ తంతు నడుస్తుండడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ అండదండలు ఉండి, అధికారుల కనుసన్నల్లోనే రిసార్ట్స్ నడుస్తుండడంతో ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు యజమానులపై చర్యలు సైతం ఉండడం లేదు.
Also Read:Thummala Nageswara Rao: రైతులను మోసం చేసి ఇప్పుడు మాటలా?.. మంత్రి సవాల్!
విల్డర్నెస్ రిసార్ట్ బరితెగింపు
వికారాబాద్ జిల్లా (Vikarabad District) కేంద్రానికి చేరువలోనే ఉన్న సర్పన్ పల్లి ప్రాజెక్ట్ ఆనుకుని విల్డర్నెస్ క్యాంప్ సైట్ రిసార్ట్ ఉంది. మూడు రోజుల క్రితం ఇద్దరు మహిళా పర్యాటకులు బోటింగ్‌కు వెళ్లి ప్రమాదం బారిన పడ్డారు. బోటు బోల్తా పడడంతో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. (Farmers) రైతులకు సంబంధించిన అసైన్డ్ భూములను లీజుకు తీసుకోవడంతోపాటు ప్రాజెక్టుకు సంబంధించిన కొంత స్థలాన్ని సైతం ఆక్రమించి రిసార్ట్‌ను నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బోటింగ్‌ను నిర్వహిస్తుండగా అందుకు సంబంధించిన సర్టిఫికెట్లతోపాటు సేఫ్టీ కిట్లు లేవు. కాలం చెల్లిన పడవలనే బోటింగ్ కోసం వినియోగిస్తున్నారు. ఇరిగేషన్ శాఖ నుంచి గానీ, టూరిజం శాఖ నుంచి సైతం ఎటువంటి అనుమతులు లేకుండానే అక్రమంగా బోటింగ్ నిర్వహిస్తున్నారు. 4 నెలల క్రితమే ఇరిగేషన్ శాఖ అధికారులు బోట్లను సీజ్ చేసినప్పటికీ మళ్లీ యథావిధిగా నడిపిస్తున్నారు.
ఇక్కడి నిర్వాహకుల అక్రమాలను వెలుగులోకి తెచ్చేందుకు వెళ్లే మీడియాపై అమెరికన్ కుక్కలను వదిలిపెట్టి అక్కడకు వెళ్లకుండా భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో విల్డర్నెస్ రిసార్ట్ నిర్వాహకుల బరి తెగింపు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఇద్దరు మహిళలు బోటింగ్ కు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోగా పోలీసులు సైతం ప్రమాదకర ఘటన అంటూ పిట్టీ కేసు పెట్టి చేతులు దులుపుకున్నారు. అయితే, విల్డర్నెస్ రిసార్ట్ యజమాని నెల్లూరు ప్రసాద్ రెడ్డికి ఉన్న రాజకీయ అండదండల నేపథ్యంలోనే చర్యలకు అధికార యంత్రాంగం సాహసించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గత ప్రభుత్వంలో (BRS Party) బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కీలక నేతతోపాటు ఈ ప్రాంతానికి చెందిన మరో నేత అండ సదరు యజమానికి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ విల్డర్నెస్ రిసార్ట్ అదే పోకడన వెళ్తున్నది. కొద్ది నెలల క్రితం మోటార్ బైక్ నడుపుతూ ఒకరు బోల్తా పడి చనిపోయారు. గతంలో ఇక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలోనూ రిసార్ట్ లో పనిచేసే వ్యక్తులు గాయపడ్డట్లు తెలిసింది. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ పెద్దలతో, అధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తుండడం వల్లనే విల్డర్నెస్ రిసార్ట్ పై చర్యలకు ఎవరూ సాహసించడం లేదు. ప్రస్తుత ఘటనలోనూ అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు రిసార్ట్ యజమానికి కేసు నుంచి బయట పడవేసేందుకు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: MLA Satyanarayana: కోటి మంది మహిళలను.. కోటీశ్వరులను చేయడమే లక్ష్యం!