Telangana Weather: తెలంగాణలో శీతల గాలులు ఒక్కసారిగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఫలితంగా గత పది రోజులుగా రాత్రి వేళ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. సూర్యుడు వచ్చే వరకూ బయటకు రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. 11 రోజులుగా వీస్తున్న చల్లటి గాలుల.. ఇవాళ రాత్రి నుంచి తగ్గుముఖం పడతాయని తెలిపింది. రేపటి నుంచి చలి తీవ్రత తగ్గుతుందని అంచనా వేసింది.
పెరగనున్న ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో చలి తీవ్ర తగ్గుముఖం పట్టడానికి గల కారణాన్ని సైతం వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం నుంచి తేమతో కూడిన ఈశాన్య గాలులు రావడంతో.. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వెల్లడించింది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు పెరిగి.. ఆ ప్రభావం రాత్రి వరకూ కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ నిపుణులు స్పష్టం చేశారు.
నవంబర్‌లో రికార్డు స్థాయి చలి
గత కొన్ని రోజులుగా తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయాయి. దీనికి తోడు సాయంత్రం నుంచి వీస్తున్న చల్లటి గాలులతో చలి తీవ్రత మరింత పెరిగింది. ఫలితంగా ఒక్కసారిగా పెరిగిన చలితో ప్రజలు అల్లాడుతున్నారు. గత నవంబర్ నెలతో పోలిస్తే చాలా చోట్ల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. సాధారణంగా క్రిస్ మస్, సంక్రాంతి సమయాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ఇందుకు భిన్నంగా నవంబర్ లోనే అధికంగా చలి ఉండటం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎట్టకేలకు చలి తగ్గుతుందని వాతావరణ శాఖ సూచించడంతో వారికి ఉపశమనం లభించనుంది.
తెలంగాణకు వర్ష సూచన
మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నవంబర్ 23-24 తేదీల్లో తేలికపాటి చినుకులు పడే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడితే.. మరికొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. నవంబర్ చివరి వారంలో అంటే 27-28 తేదీల్లోనూ పలు ప్రాంతాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని వాతావరణశాఖ అభిప్రాయపడింది.
Also Read: CM Revanth Reddy: మహిళలకు సీఎం గుడ్ న్యూస్.. అమెజాన్‌తో సంప్రదింపులు.. డీల్ కుదిరితే డబ్బే డబ్బు!
రైతులకు అలెర్ట్
మరోవైపు మారుతున్న క్లైమెట్ తో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. నెలాఖరులో పడే మోస్తరు వర్షాలు.. పంటలపై ప్రభావం చూపొచ్చని హెచ్చరించింది. పంట కోత, సంరక్షణకు ఈ వర్షాలు ఆటంకం కలిగించే ప్రమాదముందని తెలిపింది. అయితే నవంబర్ చివరి వారంలో కురిసే వర్షాలు.. రబీ పంటకు శ్రేయస్కరంగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
