Lionel Messi: ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి శనివారం హైదరాబాద్ పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిమానులు ఆయనతో ఫొటో దిగేందుకు ‘ది గోట్ ఇండియా టూర్’ (GOAT India Tour) నిర్వాహకులు అవకాశం కల్పించారు. అయితే ఇందుకోసం ఏకంగా 10 లక్షలు రూపాయాలను టికెట్ ధరగా నిర్ణయించారు. మెస్సీతో టికెట్ దిగాలని భావించిన వారు రూ.9.95 లక్షలు + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
100 మందికి మాత్రమే..
మెస్సీతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిర్వహించనున్నట్లు ‘ది గోట్ టూర్’ నిర్వాహక కమిటీ (హైదరాబాద్) సలహాదారు పార్వతిరెడ్డి తెలిపారు. కేవలం 100 మందికి మాత్రమే మెస్సీతో ఫొటో దిగే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తిగల వారు డిస్ట్రిక్ యాప్ లో టికెట్ ను కొనుగోలు చేయవచ్చని పార్వతి రెడ్డి సూచించారు. మెస్సీపై విపరీతమైన అభిమానం కల వ్యక్తులు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రేవంత్ వర్సెస్ మెస్సీ
ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీ శనివారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. ఆయనతో పాటు రోడ్రిగో డి పాల్ (అర్జెంటీనా), లూయిస్ సువారెజ్ (ఉరుగ్వే) సైతం నగరానికి రానున్నారు. అనంతరం 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫుట్ బాల్ మ్యాచ్ ను వీక్షించేందుకు మెస్సీ వస్తారు. సింగరేణి ఆర్ఆర్-9, అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ జట్టు మధ్య జరిగే మ్యాచ్ ను తిలకిస్తారు. అటు సీఎం రేవంత్ రెడ్డి సైతం ఉప్పల్ స్టేడియానికి విచ్చేయనున్నారు. మ్యాచ్ చివరి 5 నిమిషాల్లో సీఎం రేవంత్ స్వయంగా బరిలోకి దిగనున్నారు. అటు మెస్సీ సైతం ఈ మ్యాచ్ లో కొద్దిసేపు ఆడనున్నారు.
Also Read: Virat – Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జీతాలను రూ.2 కోట్ల మేర తగ్గించబోతున్న బీసీసీఐ!.. కారణం ఇదేనా?
చిన్నారులకు ఫుట్ బాల్ టిప్స్
మ్యాచ్ అనంతరం మెస్సీ ఆధ్వర్యంలో ఫుట్ బాల్ క్లినిక్ జరగనుంది. యూనిసెఫ్ అంబాసిడర్ అయిన మెస్సీ.. పిల్లలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఫుట్ బాల్ ఎలా నేర్చుకోవాలి? ఏ విధంగా ఆడాలి? ఆట మధ్యలో ఎలాంటి టెక్నిక్స్ అనుసరించాలి? వంటి వాటిపై పిల్లలకు టిప్స్ చెప్పనున్నారు. అనంతరం మ్యాచ్ విజేతలకు మెస్సీ.. బహుమతులు అందజేస్తారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి.. మెస్సీని రాష్ట్ర ప్రభుత్వం తరపున సన్మానించనున్నారు. మెస్సీ తన ఇండియా టూర్ లో హైదరాబాద్ తో పాటు ముంబయి, కోల్ కత్తా, దిల్లీ నగరాల్లోనూ పర్యటించనున్నారు.

