Kawasaki Z650RS: జాబ్ లో సెటిల్ అవ్వగానే అబ్బాయిలు ముందుగా ఒక స్టైల్ బైక్ ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తుంటారు. అలంటి వారి కోసం ఆటో రంగం కొత్త కొత్త బైక్ లను మార్కెట్లోకి తెస్తుంది. అయితే, తాజాగా కవాసకి తన నియో-రెట్రో మోటార్‌సైకిల్ అయిన Z650RS అప్‌డేటెడ్ వెర్షన్‌ను భారత మార్కెట్లో రూ. 7.83 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్‌లో చిన్నవైనా ముఖ్యమైన మార్పులు చేసి మన ముందుకు తీసుకొచ్చింది. తాజా వెర్షన్ ఇప్పుడు E20 ఇంధన అనుకూలతతో వస్తుంది, ఇది భారతదేశం యొక్క ఇథనాల్-మిశ్రమ ఇంధన అవసరాలకు అనుగుణంగా ఉంది.
మోటార్‌సైకిల్‌లో యాంత్రికంగా ఎలాంటి మార్పులు చేయనప్పటికీ, దీనికి కొత్త కలర్ ఆప్షన్, పనితీరులో చిన్న మార్పులు చేసింది. 2026 కవాసకి Z650RS ఇది వరకు మోడల్‌లో ఉన్న 649cc, ప్యారలల్-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించడం కొనసాగిస్తోంది. ఈ మోటార్ ఇప్పుడు E20 ఇంధనానికి అనుగుణంగా ఉంది, కానీ కొత్తగా ఎలాంటి మార్పులు చెయ్యలేదు. ఇది 68hp శక్తిని, 62.1Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది మునుపటి వెర్షన్ కంటే 1.9Nm తక్కువ. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. కవాసకి ఇప్పటికే తన 650cc లైనప్‌లోని నింజా 650 , వెర్సిస్ 650 వంటి ఇతర మోడళ్లను కూడా ఇలాంటి E20 అనుకూలతతో అప్డేట్ చేసింది.
కొత్త కలర్ ఆప్షన్ తో కవాసకి Z650RS
యాంత్రిక సెటప్ అలాగే ఉన్నప్పటికీ, కవాసకి Z650RS కోసం కొత్త పెయింట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. తాజా వెర్షన్ మెటాలిక్ బ్లూ రంగులో గోల్డ్ యాక్సెంట్స్‌తో వస్తుంది. ఇది మునుపటి బ్లాక్-అండ్-గోల్డ్ కలర్ థీమ్ స్థానంలో వచ్చింది. ఈ మోటార్‌సైకిల్ రౌండ్ LED హెడ్‌ల్యాంప్, కన్నీటి చుక్క ఆకారంలో ఉండే ఫ్యూయల్ ట్యాంక్, గోల్డ్-ఫినిష్డ్ అల్లాయ్ వీల్స్ వంటి క్లాసిక్ డిజైన్ ను కలిగి ఉంది.
ధర ఎంతంటే?
అప్‌డేట్ చేయబడిన కవాసకి Z650RS ధర రూ. 7.83 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. దీంతో, ఇది వరకు ఉన్న మోడల్ తో పోల్చి చూస్తే రూ. 14,000 ఎక్కువగా ఉంది. పాత మోడల్ ధర రూ. 7.69 లక్షలు.

