iPhone 16: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఒకప్పుడు అసాధ్యంగా కనిపించిన ఘనతను యాపిల్ ఇప్పుడు సాధించింది. చౌక ఆండ్రాయిడ్ ఫోన్ల ఆధిపత్యం ఉన్న దేశంలో, ఐఫోన్ 16 అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. దీంతో యాపిల్ ఒక ప్రీమియం బ్రాండ్ నుంచి మెయిన్‌స్ట్రీమ్ ప్లేయర్‌గా మారిందని ఓ నివేదిక వెల్లడించింది.
అమ్మకాలలో బడ్జెట్ ఫోన్లను దాటేసిన ఐఫోన్ 16
పలు నివేదికలు ప్రకారం, 2025 మొదటి 11 నెలల్లో యాపిల్ సుమారు 65 లక్షల ఐఫోన్ 16 యూనిట్లు విక్రయించింది. ఇదే కాలంలో వివో నుంచి రిలీజ్ అయిన బడ్జెట్ మోడల్ Y29 5G సుమారు 47 లక్షల యూనిట్లు మాత్రమే షిప్ చేసింది. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే.. ఐఫోన్ 16 ధర వివో Y29 5G కంటే మూడింతలు ఎక్కువగా ఉండటం. అయినప్పటికీ, అమ్మకాలలో యాపిల్ స్పష్టమైన ఆధిక్యం సాధించడం మార్కెట్ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేసింది.
టాప్ 5లోకి ఐఫోన్ 15 కూడా
ఐఫోన్ 16తో పాటు, ఐఫోన్ 15 కూడా 2025లో టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ల జాబితాలో చోటు దక్కించుకుంది. దాదాపు రూ. 47,000 ప్రారంభ ధర ఉన్న ఈ ఫోన్, రూ.14,000 ధరలో లభించే బడ్జెట్ ఫోన్లను వెనక్కి నెట్టడం భారత వినియోగదారుల కొనుగోలు ధోరణిలో స్పష్టమైన మార్పును సూచిస్తోంది.
EMIలు, క్యాష్‌బ్యాక్‌లే గేమ్‌చేంజర్
నో-కాస్ట్ EMIలు, బ్యాంక్ ఫైనాన్సింగ్, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు వంటి సదుపాయాలు ప్రీమియం ఫోన్లను సామాన్య వినియోగదారులకు మరింత చేరువ చేశాయి. దీంతో ఖరీదైన ఫోన్లు కూడా అందుబాటులో ఉన్నట్లుగా భావించే ట్రెండ్ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.
ఈ విజయం మరింత ప్రాధాన్యత సంతరించుకోవడానికి కారణం. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మొత్తం పరిస్థితి. 2025లో కూడా మార్కెట్ పెద్దగా పెరగకపోవచ్చని అంచనాలు ఉన్నాయి. వరుసగా నాలుగో ఏడాది కూడా సింగిల్ డిజిట్ గ్రోత్‌కే పరిమితమయ్యే అవకాశముంది. మొత్తం షిప్‌మెంట్లు సుమారు 158 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉండొచ్చని అంచనా. అలాంటి పరిస్థితుల్లోనూ యాపిల్ అమ్మకాలలో జోరు చూపించడం విశేషంగా మారింది.
ప్రీమియం ఫోన్లలో 8% వాటా
నవంబర్ 2025 వరకు భారత మార్కెట్‌లో అమ్ముడైన మొత్తం స్మార్ట్‌ఫోన్లలో ఐఫోన్ 15, 16 కలిపి సుమారు 8% వాటాను దక్కించుకున్నాయి. ప్రీమియం సెగ్మెంట్‌కు చెందిన ఫోన్లకు ఇది గణనీయమైన వాటాగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

