T20 WorldCup Australia Captain Pat Cummins Serves Drinks To Teammates: టీ20 వరల్డ్ కప్‌లో ఒమన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయింది. ఈ సందర్భంగా తన సహచర ఆటగాళ్లకు డ్రింక్స్ అందిస్తూ ప్యాట్ కమిన్స్ వాటర్ బాయ్‌గా మారాడు. గతేడాది ఆస్ట్రేలియాను ప్రపంచ విజేతగా నిలిపిన ఈ నాయకుడు పొట్టి కప్‌లో తుదిజట్టులో చోటు కోల్పోవడం గమనార్హం. కమిన్స్‌కు 2023 ఎంతో ప్రత్యేకమైంది.
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా టైటిల్ సాధించడంలో సారథిగా కమిన్స్ మెయిన్ రోల్ పోషించాడు. ఈ నేపథ్యంలో బ్యాట్, బాల్‌తో పాటు జట్టు పగ్గాలను గొప్పగా నడిపించిన కమిన్స్ కోసం ఐపీఎల్ వేలంలో భారీగా డిమాండ్ పెరిగింది. అతని కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ.20.50 కోట్లు వెచ్చించింది. ఆ భారీ ధరకు ఐపీఎల్ 2024 సీజన్‌లో కమిన్స్ న్యాయం చేశాడు. సన్‌రైజర్‌కి కప్ అందించడం కోసం ఎంతగానో పోరాడాడు. అయితే ఆఖరి మెట్టుపై బోల్తాపడి హైదరాబాద్ రన్నరప్‌గా నిలిచింది. ఇక ఆటగాళ్లలో దూకుడు పెంచి సన్‌రైజర్స్ నయా రికార్డులు సాధించడంలో కమిన్స్ కీ రోల్ పోషించాడు.
Also Read: బుమ్రానా, మజాకా..
ఫైనల్లో కేకేఆర్ చేతిలో ఓడి టైటిల్‌ను తృటిలో కోల్పోయాడు. కెప్టెన్‌గానే కాకుండా బౌలర్, బ్యాటర్‌గా సత్తాచాటాడు. మిడిల్ డెత్ ఓవర్లలో గొప్పగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి వికెట్లు కొల్లగొట్టాడు. అలాగే బ్యాటుతోనే మెరిశాడు. ప్రధాన బ్యాటర్లు విఫలమైన సందర్భాల్లో ఆఖరి వరకు క్రీజులో ఉండి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. అదే జోరుతో కమిన్స్ ఆస్ట్రేలియాకు టీ20 వరల్డ్ కప్ కూడా అందిస్తాడని భావించారంతా. కానీ కమిన్స్ తుది జట్టులోనే చోటు దక్కించుకోలేకపోయాడు. గత కొన్నాళ్లుగా ఆసీస్ టీ20 జట్టులో కమిన్స్ రెగ్యులర్ ప్లేయర్ కాదు. వన్డే, టెస్టు జట్టు పగ్గాలు నడిపిస్తూ బిజీగా ఉండేవాడు. అలాంటిది మైదానంలో తన సహచరుల కోసం కమిన్స్ డ్రింక్స్ అందించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. అహం లేకుండా జట్టు కోసం ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్న వరల్డ్ కప్ విజేతను కొందరు నెటిజన్లు కొనియాడుతుంటే, మరికొందరు మాత్రం కమిన్స్‌కి తీరని కష్టాలు వచ్చాయని బాధపడుతున్నారు.