T world cup cricket India success with two winnings Pak fail:
టీ 20 ప్రపంచ కప్ ఈ సారి సరికొత్త టీమ్స్ తో సందడి చేస్తోంది. ఐపీఎల్ 2024 మాదిరిగా భారీ స్కోర్లు నమోదవకున్నా..సూపర్ ఓటర్లు, ఉత్కంఠ ఫలితాలతో మెగా టోర్ని మ్యాచ్ లు అభిమానులకు మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. క్రికెట్ ఆటలో పసికూన జట్లు సైతం వరల్డ్ టాప్ టీమ్ లకు తమ ఆట తీరుతో షాక్ ఇస్తున్నాయి. టాప్ టీమ్స్ సూపర్ 8 కి చేరకుండానే ఇంటిదారి పట్టేలా చేస్తున్నాయి. ఆదివారం ఇండియాతో తలపడిన పాక్ ఇప్పటిదాకా ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓడిపోయి సూపర్ 8కి చేరే అవకాశాలు దాదాపు పోగొట్టుకుంది.
గ్రూప్-ఏ లో ఇండియా, పాక్, అమెరికా, కెనడా ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. ఐర్లండ్, పాక్ తో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఇండియా మంచి విజయాలు నమోదు చేసి సూపర్ 8 కి వెళ్లే అవకాశం దక్కించుకుంది. ఇంకా ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు ఇండియా సూపర్ 8కి చేరినట్లే. పైగా ఈ గ్రూప్ లో భారత్ 4 పాయింట్లతో టాప్ పొజిషన్ లో ఉంది. ఇక చివరి రెండు మ్యాచుల్లో కెనడా, అమెరికాలతో భారత్ తలపడనుంది. ఈ రెండు మ్యాచ్ లూ గెలవడం ఇండియాకు పెద్ద కష్టం కాదు. కనీసం ఒక్కటి గెలుచుకున్నా ఇండియా సూపర్ 8కి దూసుకుపోతుంది. పాక్, కెనడాలపై విజయం సాధించిన అమెరికాకు భారత్ ను ఎదుర్కోవడం కొంచెం కష్టమే.
పాక్ సూపర్ 8 కష్టమే..
భారత్ విజయ యాత్ర ఇలా ఉంటే.. ఇక పాక్ పరిస్థితి దయనీయంగా ఉంది. టోర్నీకి ముందు సెమీస్‌కు చేరే నాలుగు జట్లలో పాకిస్థాన్ పేరు చెప్పని మాజీ క్రికెటర్ లేడు. గత ఎడిషన్లలోనూ పాక్ సెమీస్ చేరిన సంగతి తెలిసిందే. కానీ, ఈసారి మాత్రం వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి ఇంకా పాయింట్ల ఖాతాను కూడా తెరవలేదు. ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడి ఓడిన పాకిస్థాన్.. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్ స్టేజ్‌లో నుంచే నిష్క్రమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యూఎస్, భారత్ చేతుల్లో ఓడిన పాక్.. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఐర్లాండ్, కెనడాతో ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు గెలిచినా.. పాక్ ఖాతాలో 4 పాయింట్స్ చేరుతాయి. అదే సమయంలో రన్‌రేట్ కూడా బాగుండాలి. పాక్ సూపర్ 8 చేరాలంటే యూఎస్ తమ చివరి రెండు మ్యాచ్‌లలో ఓడిపోవాలి. ఒక్కటి గెలిచినా.. పాక్ పని ఔట్. పాక్ భవితవ్యం మొత్తం ఇప్పుడు యూఎస్ మీద ఆధారపడి ఉంది.