yusuf Pathaan Wins Against Bengal Congress Chief Adhir Chowdhury In Baharampur: టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. బెంగాల్‌లోని బహరంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన, కాంగ్రెస్ కీలక నేత అధిర్ రంజన్ చౌధురిపై గెలుపొందారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా యూసఫ్ పఠాన్ 73వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో అధిర్ రంజన్‌ను ఓడించారు.
ముర్షీదాబాద్ జిల్లాలోని బహరంపూర్ నియోజకవర్గం నుంచి అధీర్ రంజన్ చౌధరి 1999 నుంచి వరుసగా ఐదుసార్లు ఎంపీగా విజయం సాధించారు. బెంగాల్‌లో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న ఆయన, యూసఫ్ పఠాన్ చేతిలో చిత్తయ్యారు. బీజేపీ నుంచి ప్రముఖ డాక్టర్ నిర్మల్ చంద్ర సాహా బరిలో నిలిచినా ఆయన కనీస పోటీ ఇవ్వలేకపోయారు.యూసఫ్ పఠాన్ స్వస్థలం గుజరాత్‌లోని బరోడా. తమ రాష్ట్రం కాకపోయినా, నాన్ లోకల్ అభ్యర్థి అయినా బహరంపూర్ నియోజకవర్గ ప్రజలు యూసఫ్ పఠాన్‌కే పట్టం కట్టారు. బహరంపూర్‌లో ముస్లింల జనాభా 50 శాతానికిపైనే ఉంటుంది. నియోజకవర్గంలో ముస్లింల జనాభా ఎక్కువ అయినప్పటికీ.. 1952 నుంచి ఇప్పటి వరకూ ప్రధాన పార్టీలేవీ ముస్లింలకు ఇక్కడ టికెట్ కేటాయించలేదు.దాంతో ముస్లిం మెజార్టీ నియోజకవర్గమైన బహరంపూర్ నుంచి ఇప్పటి దాకా ముస్లింలెవరూ ఎంపీలుగా ఎన్నిక కాలేదు.
దీంతో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఈసారి వ్యూహాత్మకంగా యూసఫ్ పఠాన్‌ను బరిలోకి దించి ఫలితాన్ని రాబట్టింది. ఇప్పటి వరకూ బహరంపూర్‌లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తూ వచ్చిన ముస్లింలు తమ మతానికి చెందిన యూసఫ్ పఠాన్‌ను గెలిపించుకున్నారు.యూసఫ్ పఠాన్ గతంలో ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించారు. దీంతో బెంగాల్ ప్రజలకు కూడా ఆయన చేరువయ్యారు. యూసఫ్ పఠాన్ తరఫున ఆయన తమ్ముడు, టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తన అన్నకు ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.