Inspirational Journey Of Cricketers From Uganda: కనీస అవసరాలు తీర్చుకోవడానికి, నిత్యవసర వస్తువులు కొనుక్కోవడానికి రోజూ పోరాడాల్సిన పరిస్థితి. ఎందుకంటే వారు నివసించే ఇంటి చుట్టూ మురికివాడలే. శుద్ధమైన తాగునీరు దొరకదు. నాణ్యమైన వైద్యం అందదు. కుటుంబాన్ని పోషించడానికి సరైన ఉద్యోగం ఉండదు. అలా అని ఆ ఆటగాళ్లు అంతటితో ఆగిపోలేదు. క్రికెట్‌లో ఎలాగైనా రాణించాలనే తపనతో ముందుకు అడుగులు వేశారు. ఇప్పుడు ఏకంగా ఉగాండా దేశం తరపున టీ20 ప్రపంచకప్‌లో ఆడబోతున్నారు. ప్రపంచకప్ అరంగేట్రం చేయబోతున్న ఆ జట్టులో పేసర్ జుమా మియాగి, సైమన్ సెసాజి, ఎంవెబేజ్ రిజర్వ్ ఆటగాడిది కూడా ఇలాంటి నేపథ్యమే.
ఉగాండా రాజధాని కంపాలాలో 60 శాతం జనాభా మురికివాడల్లోని నివసిస్తున్నారనేది ఓ సర్వేలో తేలింది. కంపాలా శివారులోని నాగురు మురికివాడకు చెందిన 21 ఏళ్ల మియాగి ఇప్పటివరకూ 21 అంతర్జాతీయ టీ20ల్లో 34 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటికీ ఫ్యామిలీతో కలిసి అతను మురికివాడల్లోనే నివసిస్తున్నాడు. ఫుట్‌బాల్‌ను ప్రేమించే ఆ దేశంలో ఇప్పుడిప్పుడే క్రికెట్‌కు ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఆటగాళ్లను ఆదర్శంగా తీసుకుని మరికొంత మంది మురికివాడల నుంచి జాతీయ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉందని ఆ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన భారత్‌కు చెందిన అభయ్ శర్మ చెప్పాడు. కొంతమంది ఆటగాళ్లు చాలా పేదరికం నుంచి వచ్చారు. జాతీయ జట్టుకు ఆడుతున్న వీళ్లను చూస్తుంటే స్ఫూర్తి కలుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్లు జీవిస్తున్నారని అనుకోలేదు.
Also Read: పట్టపగలే చుక్కలు చూపించిన వెస్టిండీస్
కోచ్‌లను వీళ్లెంతో గౌరవిస్తారు. వాళ్ల జీవితాలను మేం మారుస్తామని నమ్ముతున్నారు. క్రికెట్లో ఈ దేశం వృద్ధి సాధించాలంటే ఉత్తమ మౌలిక వసతులు కావాలి. అండర్ 16 స్థాయిలో ఆటను ప్రవేశపెట్టాలి. ఇప్పుడిక్కడ రెండే మైదానాలున్నాయి. ప్రాక్టీస్, కూకబూర బంతులు, పౌష్టికాహారం కోసమూ పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది. జట్టు బౌలింగ్‌లో బాగానే ఉంది, కానీ బ్యాటింగ్ మెరుగుపడాలని భారత్‌కి చెందిన అభయ్ పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో ఉగాండా తమ తొలి మ్యాచ్‌ను సోమవారం అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. ఏదేమైనా వారి తలరాతలను వారే మార్చుకొని ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పుడిప్పుడే వెలుగులోకి రావడంతో క్రికెట్ ప్రపంచమంతా తమవైపు చూస్తోందనే చెప్పాలి.