కోల్ కతా: టెస్టులు, వన్డేల్లో వరుస పరాజయాలు పలకరిస్తున్నా.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీ20ల్లో మాత్రం యువ భారత్ అదరగొడుతోంది. టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన అనంతరం టీ20ల్లో ఏడుసార్లు 200+ స్కోర్లు చేసిందంటే కుర్రాళ్లు ఎలా ఇరగదీస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందే ఇంగ్లండ్ తో 5 టీ20ల సిరీస్ లో భారత్, ఇంగ్లండ్ జట్లు ధనాధన్ పోరుతో అలరించేందుకు సిద్ధమౌతున్నాయి. ఈ సిరీస్ లో భాగంగా నేడు ఈడెన్ గార్డెన్స్ లో తొలి మ్యాచ్ జరగనుంది. గతేడాది తిలక్ వర్మ, సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్య కలిపి మొత్తంగా 4,304 పరుగులు చేయగా.. తొమ్మిది సెంచరీలతో ప్రత్యర్థి జట్లను యువ భారత్ వణికించింది. టీ20ల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా రిటైరైనా.. భారత్ మాత్రం మరింత దూకుడుగా ఆడుతూ వరుస విజయాలతో దూసుకుపోతోంది. కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో ఆడుతున్న ప్రస్తుత జట్టులో 8 మంది ప్లేయర్లకు భారత్ లో టీ20 మ్యాచ్ లాడిన అనుభవం లేకపోయినా.. ఐపీఎల్ లో ఆడి సత్తా నిరూపించుకున్నారు. కాగా, ఇంగ్లండ్ జట్టు కూడా యువ ఆటగాళ్లతో నిండి ఉంది. రెండు జట్లలోనూ దూకుడుగా బ్యాటింగ్ చేయగల బ్యాటర్లు ఉండడం.. ఈ ఫార్మాట్ లో అద్భుత ప్రదర్శన చేసే ఆటగాళ్లు ఉండడంతో రెండు జట్ల మధ్య సంకుల సమరం ఖాయమే.
షమీపైనే దృష్టి
2023 వన్డే వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించిన షమీ పైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఆటోర్నీ తర్వాత గాయంతో జట్టుకు దూరమైన షమీ.. సుదీర్ఘ విరామం అనంతరం కోలుకుని దేశవాళీల్లో మెరుపులు మెరిపించి మళ్లీ సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. దీంతో తాజా టీ20 సిరీస్ తో పాటు చాంపియన్స్ ట్రోఫీకీ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. దాదాపు ఏడాది విరామం తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ లోకి పునరాగమనం చేస్తున్న షమీ.. మైదానంలో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు బుమ్రా గాయంతో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో షమీ రాణింపుపై అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు 2022 టీ20 ప్రపంచకప్ సెమీస్ తర్వాత ఈ ఫార్మాట్ లో షమీ ఆడడం ఇదే మొదటిసారి. ఇక వైస్ కెప్టెన్ హోదాలో అక్షర్ పటేల్ కు ఇదే తొలిసారి. గతేడాది టీ20 ప్రపంచకప్ లో భారత్ విజేతగా నిలవడంలో ఈ ఆల్ రౌండర్ దే కీలకపాత్ర.
ఇక సౌతాఫ్రికా సిరీస్ లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు బాదిన సంజు శాంసన్, తిలక్ వర్మ ఇద్దరూ భీకర ఫాంలో ఉండడం మనకు కలిసొచ్చే అంశం..మరోవైపు ఆసీస్ సిరీస్ లో సెంచరీతో దుమ్మురేపిన నితీశ్ కుమార్ కూడా టీ20ల్లో అద్భుత ప్రదర్శన చేయగలడు. ఇక సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, హార్ధిక పాండ్యాలతో భారత బ్యాటింగ్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. ఇక స్పిన్ త్రయం వరుణ్ చక్రవర్తి, బిష్ణోయ్, అక్షర్ పటేల్ ఇంగ్లండ్ జట్టును నిలువరించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇంగ్లండ్ జట్టు కేక..
టెస్టుల్లోనే బజ్ బాల్ గేమ్ తో ఆట స్వరూపాన్ని పూర్తిగా మార్చిన కివీస్ దిగ్గజం మెక్ కల్లమ్ ఆధ్వర్యంలో ఇంగ్లండ్ జట్టు.. టీమిండియాను మొదటిసారి సవాల్ చేస్తోంది. ఇక భారత గడ్డపై ఐపీఎల్ లోనూ అద్భుతంగా రాణించిన మెక్ కల్లమ్ ఈ పోరులో ఎలాంటి వ్యూహాలు రచిస్తాడో చూడాలి. ఇక టీమ్ ఓపెనర్లుగా బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ రానుండగా.. ఇదే గ్రౌండ్ లో కేకేఆర్ జట్టుకు ఆడిన అనుభవంతో సాల్ట్ మరింత ప్రమాదకరం కానున్నాడు. ఇక రీస్ టోప్లే, శ్యామ్ కరన్, విల్ జాక్స్..జట్టులో లేకపోయినా 21 ఏండ్ల జాకబ్ బేథెల్స్ పై ఇంగ్లండ్ జట్టు కొండంత నమ్మకం పెట్టుకుంది. జాకబ్ ఆడిన ఏడు టీ20ల్లో అతని సగటు 57.66 అంటే అతనెంత నిలకడగా ఆడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇక షమీ లాగే గాయం నుంచి కోలుకున్న జోఫ్రా ఆర్చర్ కూడా మళ్లీ కమ్ బ్యాక్ ఇస్తున్నాడు. జట్టు మిడిలార్డర్ లో కెప్టెన్ బట్లర్, బ్రూక్, లివింగ్ స్టోన్ లతో ఇంగ్లండ్ జట్టుకూడా భీకరంగా కనిపిస్తోంది.
పిచ్, వాతావరణం
గతేడాది ఐపీఎల్ మ్యాచ్ ల సగటు స్కోరు 198. 8 సార్లు ఇక్కడ ఆడిన మ్యాచ్ ల్లో జట్లు 200+ స్కోర్లు సాధించడం విశేషం. ఇక నేడు జరిగే మ్యాచ్ లోనూ పరుగుల వరద పారడం ఖాయం. మంచు ప్రభావం అధికం . అందుకే టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
తుది జట్లు(అంచనా)
భారత్
శాంసన్, అభిశేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్(కెప్టెన్), హార్దిక్, రింకూసింగ్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్,వరుణ్ చక్రవర్తి, షమీ.
ఇంగ్లండ్
డకెట్, సాల్ట్, బట్లర్(కెప్టెన్), బ్రూక్,లివింగ్ స్టోన్, బేథెల్, ఒవర్టన్, అట్కిన్ సన్, ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.