India Vs Bangladesh: చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తొలి పోరు బంగ్లాతో ప్రారంభించనుంది. గ్రూప్-ఎలో భాగంగా గురువారం జరిగే తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఢీకొట్టనుంది. ఇంగ్లాదేశ్‌తో పోలిస్తే టీమిండియా బలంగా కనిపిస్తున్నా ఆ జట్టును ఏమాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. భారత జట్టు తుది జట్టుపై ఇప్పటికీ అనుమానాలున్నాయి. అయితే, ఇంగ్లండ్‌పై నెగ్గి జోరుమీదున్న టీమిండియా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. రోహిత్ చాలాకాలం తర్వాత సెంచరీతో మెరుపులు, కోహ్లీ కూడా హాఫ్ సెంచరీతో టచ్ లోకి రావడం శుభపరిణామమే అయినా, రాహుల్ బ్యాటింగ్ స్థానంపై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. సాధారణంగా రాహుల్ 5వ నెంబర్లో జరిలోకి దిగుతాడు. కానీ, మ్యాచ్ పరిస్థితినిబట్టి అతడి బ్యాటింగ్ ఆర్డర్ పై నిర్ణయం తీసుకోవాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.
అర్షదీప్ లేదా హర్షిత్
తొలి మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్ కూర్పు అతిపెద్ద సవాల్. షమి పేస్ దళాన్ని నడిపిస్తుండగా, అర్షదీప్ లేదా హర్షిత్ రాణాల్లో ఎవరికి చోటుదక్కుతుందనేది ఆసక్తిగా మారింది. కాగా, డెత్ ఓవర్లలో అద్భుతంగా రాణించే అర్షదీప్ నే ఆడించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జట్టులో ఉన్న ఏకైక సీనియర్ పేసర్ మహ్మద్ షమీ గాయం నుంచి కోలుకొని ఇటీవల జట్టులోకి వచ్చాడు. అయితే ఇంకా అంత ప్రభావవంతంగా కనిపించడం లేదు. ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లో ఆడి ఫర్వాలేదనిపించాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అనే భయం అభిమానుల్లో మొదలైంది. ఇంత పెద్ద టోర్నీలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా లాంటి ఇద్దరు అనుభవం లేని పేసర్లతో బరిలోకి దిగడం ఇబ్బందికరమే. ఇక రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి రూపంలో ఐదుగురు స్పిన్నర్లు ఎందుకు అనే ప్రశ్న ఎలాగూ ఉంది. ఒకరిని తగ్గించి మహ్మద్ సిరాజ్‌ను తీసుకెళ్లాల్సింది అనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ లెక్కన బౌలింగ్ విభాగం విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లే. కాగా, ఆల్ రౌండర్ హార్ధిక్ తో పాటు ముగ్గురు స్పిన్నర్ల వ్యూహంతో బరిలోకి దిగేందుకు మేనేజ్ మెంట్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జడేజా, అక్షర్ లతోపాటు మూడో స్పిన్నర్ గా కుల్దీప్ ఆడే అవకాశం ఉంది.
బలహీనంగా బంగ్లా జట్టు
తమీబ్ ఇక్బాల్, లిటన్ దాస్, షకీబల్ హౌస్సేన్ లాంటి మేటి ఆటగాళ్లు లేని బంగ్లాదేశ్ ఒకింత బలహీనంగా కనిపిస్తోంది. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో ఫామ్ కోల్పోవడం ఆందోళన కలిగిస్తున్నా. మిడిలార్డర్లో మహ్మదుల్లా, ముష్పికర్ ఆదుకొంటున్నారు. అయితే, స్పిన్ తో భారత్ ను దెబ్బతీయాలని బంగ్లా భావిస్తోంది. పేసర్లు నహీద్ రాణా, టస్కిన్ భారత బ్యాటర్లను కట్టడిచేస్తే గెలుపు అవకాశాలు మెరుగుపడతాయన్న అంచనాతో వ్యూహాలు రూపొందిస్తోంది.
జట్లు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్, అక్షర్, జడేజా, అర్షదీప్/హర్షిత్, షమీ, కుల్దీప్.
బంగ్లాదేశ్: తస్జిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హౌస్సేన్ షాంటో (కెప్టెన్), తౌహిండ్ ప్రిదోయ్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మహ్మదుల్లా, మెహీహసన్ మిరాజ్, రిషద్ హౌస్సేన్, టస్కిన్, ముస్తాఫిజుర్, నహీద్ రాణా.
గత ఐదు వన్డేల్లో భారత్ 2 నెగ్గగా.. బంగ్లా 3 మ్యాచ్‌లు గెలిచింది. ఓవరాల్‌గా భారత్, బంగ్లాలు 41సార్లు తలపడితే, టీమిండియా 32 మ్యాచ్‌లు, బంగ్లా 8 మ్యాచ్‌లు గెలిచాయి. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.