Free IPL Passes: క్రికెట్ లవర్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ సీజన్ – 18 అట్టహాసంగా ప్రారంభం అయింది. మండే వేసవిలో అభిమానులకు మంచి ఎంటర్ టైన్ అందించే ఐపీఎల్ సీజన్ లో మ్యాచ్ లు ఆరంభం కూడా అయ్యాయి. ఈ నేపథ్యంలో దివ్యాంగులైన క్రికెట్ అభిమానుల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ శుభవార్తను అందించింది. ఉప్పల్ లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ (IPL) మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలనుకునే దివ్యాంగుల కోసం ఉచిత పాస్ లు అందించనున్నట్లు ప్రకటించింది. దివ్యాంగుల కోసం కాంప్లిమెంటరీ పాసులను అందించడం పట్ల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది.
ఇలా అప్లై చేయండి
టికెట్లు కావాల్సిన వారు ఈ మెయిల్ ద్వారా తమ పూర్తి పేరు, కాంటాక్ట్ నంబర్, డిజబులిటీ ఫ్రూప్ (స్కాన్ చేసినది) వంటివి అధికారిక మెయిల్ Pcipl18rgics@gmail.com కు జత చేసి పంపాలని కోరింది. అయితే పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయని ముందుగా వచ్చిన దరఖాస్తులకే అధిక ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేసింది. మొదట వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రాధాన్యతా క్రమంలో దివ్యాంగులకు మ్యాచ్ పాస్ లు జారీ చేస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. కాగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టును హైదరాబాద్ సన్ రైజర్స్ ఓడించి సొంత గడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసిన సంగతి విదితమే. నేడు లక్నోతో హైదరాబాద్ తలపడనుంది. క్రికెట్ అభిమానులను ఎంటర్ టైన్ చేసేందుకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (SS Thaman) రానున్నారు. మ్యాచ్ రాత్రి 7. 30 గంటలకు ప్రారంభం కానుంది.
నేడు లక్నో – హైదరాబాద్ ఢీ
లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడింది. ఆశుతోష్ వర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ దెబ్బకి లక్నోకి ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో రిషభ్ సారధ్యంలోని లక్నో హైదరాబాద్ తో తలపడేందుకు సిద్దమైంది. తొలి మ్యాచ్ విజయంతో మంచి జోష్ లో ఉన్న సన్ రైజర్స్ రెండో మ్యాచ్ కూడా గెలవాలనే పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్ లో దుమ్మురేపిన అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెస్ ల దూకుడుతో హైదరాబాద్ పోరుకు రెడీ అయింది.
Also Read: Bhatti Vikramarka: తెలంగాణ అప్పులపై కాగ్ సంచలన రిపోర్ట్.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క
తుది జట్లు
సన్‌రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి (Nitish Reddy), హెన్రిచ్ క్లాసెన్ , అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, ఆడమ్ జంపా, మహమ్మద్ షమీ, సిమర్జీత్ సింగ్
లక్నో: ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ రాఠీ, అవేష్ ఖాన్, మణిమారన్ సిద్దార్థ్