Manoj Tiwary: ఇండియన్ క్రికెట్‌లో మరోసారి ప్రకంపనలు రేపుతూ మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన కామెంట్స్ చేశారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ల వెనుక అసలు కథ ఇదే అంటూ మరోసారి చర్చకు తెరలేపింది. తివారీ చెప్పిన దాని ప్రకారం, ఈ ఇద్దరు దిగ్గజాలు టెస్ట్ క్రికెట్‌ను కొనసాగించాలని, ఫార్మాట్ ప్రతిష్టను కాపాడాలని ఎంతగానో ఆసక్తి చూపించినప్పటికీ, జట్టులో ఏర్పడిన కొన్ని కారణాల వల్ల బలవంతంగా వైదొలగాల్సి వచ్చిందని ఆయన ఆరోపించారు. దీంతో నాయకత్వం, జట్టు మార్పులు, నిర్వహణ వ్యవస్థపై ప్రశ్నలు మళ్లీ చర్చకు దారితీస్తున్నాయి.
రోహిత్ – కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక ఇంత జరిగిందా?
2025 మే 7న రోహిత్ శర్మ టెస్ట్‌ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఐదు రోజులకే విరాట్ కోహ్లీ కూడా టెస్ట్‌ల నుంచి తప్పుకున్నట్లు పోస్ట్ తో తెలిపాడు. ఇంగ్లాండ్‌లో జరగబోయే కీలక ఆండర్సన్– టెండూల్కర్ ట్రోఫీకి ముందు ఇద్దరు సీనియర్లు వరుసగా రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులు, నిపుణులు షాక్ కి గురయ్యారు. IPL 2025 సమయంలో అది “ వేరే కారణాలు ” చెప్పినప్పటికీ, తివారీ చేసిన తాజా వ్యాఖ్యలతో అది అసలు కారణం కాదన్న అనుమానాలు బలపడుతున్నాయి.
గంభీర్‌పై తీవ్ర విమర్శలు చేసిన తివారీ
దక్షిణాఫ్రికాతో కోల్‌కతాలో జరిగిన తొలి టెస్ట్‌లో భారత జట్టు ఓడిన తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దాన్ని “ట్రాన్సిషన్ ఫేజ్”గా పేర్కొన్నారు. అయితే , తివారీ దీనిని తిప్పికొడుతూ.. భారత క్రికెట్‌లో ట్రాన్సిషన్ అవసరం లేదని, న్యూజిలాండ్ లేదా జింబాబ్వేలా పరిమిత వనరులు ఉన్న జట్లకు మాత్రమే అది వర్తిస్తుందని స్పష్టం చేశారు.
“మన డొమెస్టిక్ క్రికెట్‌లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ప్రతిభావంతులే ఉన్నారు. కోహ్లీ–రోహిత్‌లను తొలగించడం ట్రాన్సిషన్ కాదు”, అని ఓ మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తివారీ వ్యాఖ్యానించారు. జట్టు మేనేజ్‌మెంట్ ఈ ఇద్దరిని అనవసరంగా పక్కకు నెట్టిందని, కొత్త ప్రణాళిక పేరుతో తప్పుదారి పట్టించిందని ఆరోపించారు.
జట్టులో విభేదాలే కారణమా? డ్రెస్సింగ్ రూమ్ వాతావరణంపై ప్రశ్నలు
తివారీ వ్యాఖ్యలు జట్టులో ఉన్న అంతర్గత సమస్యలను బయటపెడుతున్నాయి. స్టార్ ఆటగాళ్లకు కూడా స్వేచ్ఛగా ప్రదర్శించేందుకు అనుకూలమైన వాతావరణం లేకపోవడం, అనవసర ఒత్తిళ్లు.. ఇవి ఇద్దరు సీనియర్ క్రికెటర్లను టెస్ట్ ఫార్మాట్ నుంచి దూరం చేశాయని ఆయన అంటున్నారు. టెస్ట్ క్రికెట్‌ను విడిచిపెట్టే ఉద్దేశం లేకపోయినా, పరిస్థితులు వారిని ఆ దిశగా నెట్టాయని సూచించారు.
కోల్‌కతా టెస్ట్ తర్వాత టెక్నికల్ విమర్శలు .. తివారీ అసంతృప్తి
కోల్‌కతా టెస్ట్ ఓటమి తర్వాత గంభీర్ ‘స్పిన్‌కి నిలబడే టెక్నిక్ కరువైందని’ చేసిన వ్యాఖ్యలను తివారీ తిప్పికొట్టారు. “ టెక్నిక్ లేదు అంటే కోచ్‌లు ముందే సరిచేయాల్సింది. మ్యాచ్ తర్వాత బ్లేమ్ చేయడం సరికాదు” అని ఆయన విమర్శించారు.

