Five More Days To Go To T20 World Cup Season: క్రికెట్ అభిమానుల కోసం క్రికెట్ రంగంలో ఓ పార్ట్ ముగిసింది. రెండునెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగించిన ఐపీఎల్ సీజన్ ముగిసింది. కానీ అభిమానులు మాత్రం చింతించాల్సిన పని లేదు. వినోదానికేమీ కొదువ లేదు. ఎందుకంటే భారీ స్థాయిలో, మరింత తీవ్రతతో క్రికెట్ లవర్స్‌ని అలరించడానికి విశ్వవేదిక రెడీ అయ్యింది. ధనాధన్ ఆటను వీక్షించడానికి మరీ ఎక్కువ రోజులు నిరీక్షించాల్సిన అవసరమేమీ లేకుండా చేసింది.
అమెరికా, వెస్టిండీస్ వేదికగా మరో 5 రోజుల్లో టీ20 ప్రపంచకప్ స్టార్ట్ కానుంది. 20 జట్లు 55 మ్యాచ్‌ల్లో క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు సన్నద్ధం అవుతున్నారు. భారత కాలమానం ప్రకారం జూన్ 2న టోర్నమెంట్ స్టార్ట్ కానుంది. మొత్తం 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూపులో ప్రతి జట్టు ఇంకో జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. అక్కడ జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. సూపర్ 8లో ఒక్కో గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్లో ప్రవేశిస్తాయి. టీ20 ప్రపంచకప్‌లో మ్యాచ్ టై అయితే ఫలితం కోసం సూపర్ ఓవర్‌ను నిర్వహిస్తారు. అది కూడా టైగా ముగిస్తే మళ్లీ సూపర్ ఓవర్ ఆడతారు. మళ్లీ టై అయితే మళ్లీ సూపర్ ఓవర్. ఇలా రిజల్ట్స్ వచ్చేంత వరకు సూపర్ ఓవర్ ఆడుతూనే ఉంటారు. ఐసీసీ గత కొన్నేళ్లుగా క్రికెట్ ప్రాచుర్యాన్ని పెంచడం కోసం విశేషంగా కృషి చేస్తోంది.
Also Read: మెయిన్ కోచ్ కోసం ఫేక్
ముఖ్యంగా అమెరికాలో క్రికెట్ వ్యాప్తికి మంచి ఛాన్సుందన్న ఉద్దేశంతో ఈసారి ఆ దేశంలో టీ20 ప్రపంచకప్‌ను నిర్వహిస్తోంది. మరి బేస్‌బాల్‌ను అమితంగా ఇష్టపడే అమెరికాలో క్రికెట్ ఎంత మేర చొచ్చుకుపోగలదన్నది క్వచ్ఛన్. ఐసీసీ మాత్రం యుఎస్‌ఏ మార్కెట్‌పై ఆశాభావంతో ఉంది. ఆ దేశంలో దాదాపు మూడు కోట్ల మంది క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారనేది అంచనా. 2028లో లాస్ ఏంజిలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా ఉన్న నేపథ్యంలో ఈ ప్రపంచకప్ పెద్ద ముందడుగుగా భావిస్తోంది. అమెరికాలో ఫ్యాన్స్‌లను ఆకర్షించేందుకు ఐసీసీ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. దిగ్గజ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్‌ను ప్రపంచకప్ రాయబారిగా నియమించడమే కాకుండా మియామిలో జరిగిన ఫార్ములా 1 రేసులో టోర్నీ గురించి ప్రచారం చేసింది.