will waive loan by august 15th will kcr abort brs party challenge cm revanth reddy | Swetchadaily | Telugu Online Daily News
Telangana CM Revanth reddy Mass Warning To KCR
Political News

Revanth Reddy: రుణమాఫీ చేస్తే పార్టీ రద్దు చేసుకుంటావా?: రేవంత్ సవాల్

– రేవంత్ రెడ్డి మాట ఇస్తే తప్పడు
– రైతుల రుణాలు చెల్లించే బాధ్యత నాది
– శత్రువు చేతిలో చురకత్తిగా డీకే అరుణ
– కృష్ణా జలాలు, రైల్వే లైన్ రాకుండా అడ్డుకున్నారు
– పాలమూరుకు 70 ఏళ్ల తర్వాత మళ్లీ సీఎం అవకాశం
– ఒక్క ఏడాది అండగా ఉండండి.. వందేళ్ల అభివృద్ధి చేస్తా
– దేవుడు గుడిలో.. భక్తి గుండెల్లో ఉండాలి
– మోడీ చేసిందేమీ లేదు.. అందుకే తీట పంచాయితీ పెట్టే ప్రయత్నం

Mahabubnagar: పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తామని చెబితే బీఆర్ఎస్ నాయకులు వంకరమాటలు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రుణమాఫీ సాధ్యం కాదని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారని, తాను పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తే కేసీఆర్ తన బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటారా? అని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి మాట ఇస్తే తప్పడని, ఈ విషయం కేసీఆర్‌కు తెలుసు అని అన్నారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కొన్ని చోట్ల రైతులు తీసుకున్న రుణాలు తిరిగి ఇచ్చేయాలని బ్యాంకులు నోటీసులు పంపుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని, అలా చేయొద్దని బ్యాంకు అధికారులకు సూచన చేశారు. రైతులను వేధిస్తే చూస్తూ ఊరుకోబోమని చెప్పారు. రైతుల రుణాలు చెల్లించే బాధ్యత తనదీ అని స్పష్టం చేశారు. రైతు తీసుకున్న ప్రతి పైసా తిరిగి చెల్లిస్తామని అన్నారు. పంద్రాగస్టులోపు రుణమాఫీ చేయకుంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తావా? అని మాజీ మంత్రి హరీశ్ రావు కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై సీఎం తాజాగా విరుచుకుపడ్డారు.

డీకే అరుణకూ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. డీకే అరుణ.. కృష్ణా జలాలు, రైల్వే లైన్ రాకుండా అడ్డుకున్నారని అన్నారు. మక్తల్ ఎత్తిపోతలకు అడ్డుకున్నారని వివరించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేదని అరుణను నిలదీశారు. ఆమె శత్రువు చేతిలో చురకత్తి అయిందని, పాలమూరు ప్రజల కడుపులో పొడుస్తున్నదని విమర్శించారు. అసూయ, కోపం, ద్వేషం అనే మాటలను డీకే అరుణ మాట్లాడుతున్నారని, ఆమెతో నాకేమీ పంచాయితీ అని అన్నారు. ఆమె దగ్గర ఏమున్నదని అసూయ పడాలి? అని ఎద్దేవా చేశారు. తనకు ఎవరి మీద.. ముఖ్యంగా పాలమూరుకు చెందిన ఎవరి మీద కోపం, ద్వేషం లేదని స్పష్టం చేశారు. పాలమూరు ప్రజలంతా తన వాళ్లే అని అన్నారు.

Also Read: బీఆర్ఎస్‌లో భగ్గుమన్న వర్గవిభేదాలు.. కవిత గెలిచేనా?

రాష్ట్ర ప్రజల పాలమూరు బిడ్డకు సీఎం అవకాశం ఇచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇది పాలమూరు ప్రజలకు దక్కిన అరుదైన అవకాశం అని వివరించారు. ఎప్పుడో బూర్గుల రామకృష్ణకు ముఖ్యమంత్రి అవకాశం దక్కిందని, ఇప్పుడు 70 ఏళ్ల తర్వాత మళ్లీ తనకు ఈ అవకాశం వచ్చిందని తెలిపారు. కాబట్టి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పాలమూరు అభివృద్ధికి పని చేయాలని చెప్పారు. ఈ ఒక్క ఏడాదిలో ఎన్ని ఎన్నికలు వచ్చినా పాలమూరు ప్రజలు తనకు అండగా ఉంటే ఇక్కడ వందేళ్ల అభివృద్ధిని చేసి చూపిస్తానని తెలిపారు. ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు కదా.. నా బంధువులు, బలగం మీరే కదా. కాబట్టి, ఇక్కడ లోక్ సభ ఎన్నికల్లో కనీసం 50 వేల మెజార్టీతో వంశీచంద్ రెడ్డిని గెలిపించాలి. లేదంటే సీఎం సొంత నియోజకవర్గం ఉన్న పాలమూరులో 50 వేల మెజార్టీ కూడా రాలేదని అంటారు’ అని చెప్పారు.

కేసీఆర్ పదేళ్లు ప్రజలను మోసం చేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తాగుబోతు కేసీఆర్.. తాగుబోతు సంసారం లెక్కనే రాష్ట్రాన్ని ఆగం చేశాడని సీరియస్ అయ్యారు. రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేశారని, తాను రూ. 3,900 కోట్ల లోటు బడ్జెట్‌తో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నానని చెప్పారు. వంద రోజుల్లో ఐదు గ్యారంటీలను అమలు చేశామని, రుణమాఫీ చేద్దామనుకుంటూ ఉండగానే ఎన్నికల కోడ్ వచ్చిందని తెలిపారు. పంద్రాగస్టులోపు తప్పకుండా రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పారు. రుణమాఫీ తన వల్ల కాదని హరీశ్ రావు ప్రగల్భాలు పలుకుతున్నారని, తాను పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటావా? కేసీఆర్ అంటూ సవాల్ విసిరారు. భూమి, ఆకాశం తలకిందులైనా రుణమాఫీ ఆగదని స్పష్టం చేశారు.

Also Read: లోక్ సభ బరిలో క్రికెటర్ యూసుఫ్ పఠాన్.. ఆ పార్టీ టికెట్ పైనే ఎందుకు?

కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న మోడీ కూడా ఏమీ చేయలేదని, ప్రజలకు ఏమీ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. అందుకే ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నాడని ఆరోపించారు. తీట పంచాయితి పెట్టి ఎన్నికల్లో గెలవాలని అనుకుంటున్నారని పేర్కొన్నారు. కానీ, పాలమూరు ప్రజలంతా కలిసి కట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘మేం కూడా హిందువులమే. తాత ముత్తాతల నుంచి పూజలు చేసినోళ్లమే. కానీ, దేవుడంటే గుడిలో ఉండాలి. భక్తి గుండెల్లో ఉండాలి. హిందూయిజంలోనే మతసామరస్యం ఉన్నది. పరమతాలను సమానంగా గౌరవించాలని ఉన్నది. ఊళ్లలో పీర్ల పండుగకు మనమే ముందుంటాం కదా. మన ఇంట్లో దసరా పండుగకు ముస్లింలు రారా? క్రిస్మస్‌కు మనం చర్చి పోయిరావట్లేదా? ఎన్నికల కోసం బీజేపీ నాయకులు పంచాయితీ పెడుతుర్రూ’ అని రేవంత్ రెడ్డి తెలిపారు. అందరూ కలిసి కట్టుగా ముందుకు సాగాలని, ఇక్కడి నుంచి కనీసం 50 వేల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌ను గెలిపించాలని కోరారు.

Just In

01

Panchayat Elections: మూడవ విడుత ఎన్నికలకు సర్వం సిద్ధం : కలెక్టర్ బీఎం సంతోష్

Panchayat Election: ఉత్కంఠగా పంచాయతీ ఎన్నికలు.. ఒక్క ఓటుతో అభ్యర్థుల గెలుపు!

Gold Rates: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

Medak District: స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు!

WhatsApp Scam: ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.75 లక్షలు గోవిందా.. లాభాలు ఆశ చూపి కొట్టేసిన సైబర్ క్రిమినల్స్