West Bengal: ఈ లోక్ సభ ఎన్నికల్లో ప్రముఖ క్రికెటర్, రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ యూసుఫ్ పఠాన్ బరిలోకి దిగారు. పశ్చిమ బెంగాల్‌లో ముర్షిదాబాద్ జిల్లాలోని బహరంపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. టీఎంసీ ఇచ్చిన ఆఫర్‌ను స్వీకరించిన పఠాన్.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ టికెట్ పై లోక్ సభ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
రెండు నెలల ముందు వరకు ఆయనకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనే లేదు. కానీ, టీఎంసీ ఆయనను అప్రోచ్ అయింది. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుందని ఆఫర్ చేసింది. వెంటనే తిరస్కరించాలని అనుకున్నట్టు పఠాన్ చెప్పారు. అయితే.. తన కుటుంబ సభ్యులు అందరితో ఈ విషయంపై మాట్లాడానని, వారంతా నిజానికి ఇదొక మంచి అవకాశం అని, సమాజానికి సేవ చేసే అవకాశం దక్కుతుందని సూచించినట్టు వివరించారు. ఆ తర్వాత టీఎంసీ టికెట్‌ను స్వీకరించినట్టు తెలిపారు.
2021 ఫిబ్రవరిలో యూసుఫ్ పఠాన్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. ఇప్పుడు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన పాలిటిక్స్‌లో జూనియర్. కానీ, సీనియర్ నాయకుడిపై పోటీకి దిగుతున్నారు. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, బహరంపూర్ సిట్టింగ్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరిపై ఆయన పోటీ చేయనున్నారు. తనకు అధిర్ రంజన్ చౌదరి అంటే అపార గౌరవం ఉన్నదని యూసుఫ్ పఠాన్ చెప్పారు. కానీ, ఆయనపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తున్నదని, కొవిడ్ సమయంలో అందుబాటులో లేరని, ఇతర అవసరాల కోసం కేంద్రం నుంచి నిధులను తీసుకురాలేకపోయాడనే అపవాదు ఉన్నదని వివరించారు.
Also Read: మోడీ పాలనలో రైలు వ్యవస్థ ఎవరికి చేరువైంది?
తనను బహరంపూర్ ప్రజలు ఆదరిస్తున్నారని యూసుఫ్ పఠాన్ అన్నారు. తమ సోదరుడిగా, బిడ్డగా చూసుకుంటున్నారని వివరించారు. తనను అక్కడి నుంచి వెళ్లనివ్వబోమని వారు చెబుతుండటమే ఇందుకు నిదర్శనం అని అన్నారు. తాను ఎప్పటికీ ఇక్కడి ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా బహరంపూర్ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని వివరించారు. తాను గెలిస్తే మరీ మంచిదని, ఓడిపోతానని అయితే అనుకోవడం లేదని తెలిపారు.
రాజకీయాల్లో ప్రవేశించడం, అదీ టీఎంసీ పార్టీనే యూసుఫ్ పఠాన్ ఎందుకు ఎంచుకున్నారు? ఈ ప్రశ్నను మీడియా ప్రతినిధులు ఆయనను అడిగారు. దీనికి సరదాగా రియాక్ట్ అవుతూ.. ‘క్రికెటర్‌గానైతే కెరీర్ ముగిసింది. మరి ఏదోటి చేయాలి కదా’ అని సరదాగా సమాధానం చెప్పారు. ‘సీరియస్‌గా చెప్పాలంటే.. ఈ ఆఫర్ రాగానే నా కుటుంబం, సోదరుడు ఇర్ఫాన్ ఖాన్, నా భార్య అఫ్రీన్, మిత్రులు, పెద్దలను సంప్రదించాను. వాస్తవానికి ఇదొక బహుమానం అని అవగాహనకు వచ్చాను. ఈ సమాజానికి సేవ చేయడానికి దేవుడు ఇచ్చిన ఒక అవకాశంగా భావించాను.’ అని వివరించారు.