– ఎమ్మెల్సీ పోలింగ్‌లో పాల్గొన్న రేవంత్ రెడ్డి
– అనంతరం కార్యకర్తలతో భేటీ
– ఏప్రిల్ 6 తుక్కుగూడ సభను సక్సెస్ చేద్దామని పిలుపు
– ఎంపీ ఎన్నికల్లో కొడంగల్ సెగ్మెంట్‌లో 50 వేలు మెజారిటీ రావాలన్న సీఎం
– ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ధీమా
Voted Telangana CM Revanth Reddy : మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో భాగంగా గురువారం జరిగిన పోలింగ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కొడంగల్ ఎమ్మెల్యే హోదాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం కొడంగల్‌లోని తన నివాసంలో పార్టీ నాయకలు, అభిమానులు, కార్యకర్తలతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తన సొంత నియోజక వర్గం అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల వేళ తాను కొడంగల్‌లో ఎక్కువ సమయం ప్రచారానికి కేటాయించకపోయినా, ఓటర్లు తనను సొంత కుటుంబసభ్యుడిగా ఆదరించి గెలిపించారని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుక ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని, కోడ్ తర్వాత ఇక్కడ పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 6న తుక్కుగూడలో జరిగే రాహుల్ సభకు కొడంగల్ నుంచి భారీగా కార్యకర్తలు తరలిరావాలనీ, వచ్చే ఎంపీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ సీటును గెలిపించేందుకు కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంటు నుంచి 50 వేలకు పైగా మెజారిటీ సాధించేందుకు నేతలంతా కలిసి పనిచేయాలని సూచించారు.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 1439 మంది ఓటర్లుండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి నవీన్ కుమార్ రెడ్డితోపాటు స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో నిలిచారు. గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్ కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి 99.86% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 1439 ప్రజాప్రతినిధుల్లో 1437 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహబూబ్ నగర్‌లో 245, వనపర్తి లో 218, గద్వాలలో 225 , కొల్లాపూర్‌లో 67, అచ్చంపేటలో 79, కల్వకుర్తిలో 72 మంది, షాద్ నగర్‌లో 171 మంది ఓటర్లుండగా అందరూ (100%) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగర్ కర్నూల్‌లో 101 మందికి 100మంది, నారాయణపేటలో 205 మందికి 204 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Real Also : వేల కోట్ల ‘వ్యాట్’.. హాంఫట్
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ సరళిని బట్టి గెలుపు పట్ల కాంగ్రెస్ వర్గాలు ధీమాగా ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఓటు వేసేందుకు గద్వాల జడ్పీ హాల్ పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రికత్త మినహా అన్నిచోట్ల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఉపఎన్నిక ప్రశాంతంగా ముగియగా..ఏప్రిల్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. అయితే ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి కల్వకుర్తిలో ఎమ్మెల్సీగా గెలుపొందడంతో ఈ ఉపఎన్నిక జరిగింది.