Telugu States: తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయి. బుధవారం జలశక్తి కార్యాలయంలో జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడుల మధ్య సమావేశంలో ఇరువురు అంగీకారం తెలిపారు. ముఖ్యంగా.. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం తెలిపింది. మరోవైపు..గోదావరి నది యాజమాన్య బోర్డు తెలంగాణలో కృష్ణ నది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంగీకారం తెలపడం శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. అంతేకాదు.. ఇదే సమావేశంలో శ్రీశైలం ప్రాజెక్ట్ మరమ్మతులకు కూడా ఆంధ్రప్రదేశ్ అంగీకారం తెలపడం మంచి పరిణామమే.
మంచి రోజులు..!
ఇరు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి అధికారులు, సాంకేతిక నిపుణులతో కమిటీని నియమించడానికి ఇరువురు ముఖ్యమంత్రులు ఒప్పుకున్నారు. దీంతో వారం రోజుల్లో కమిటీ నియామకం కానుంది. కాగా, ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి. అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని తెలుగు రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవడంతో మంచి రోజులు వచ్చినట్టే అని విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read- Nithya Menen: జాతీయ అవార్డు తీసుకునే ముందురోజు నిత్యా మీనన్ ఏం చేసిందో తెలుసా?
గంటన్నరపాటు సమావేశం జరిగినా!
సమావేశం గంటన్నరపాటు సుదీర్ఘంగా సాగినప్పటికీ, తక్షణమే ఏకగ్రీవంగా అంగీకరించిన స్పష్టమైన నిర్ణయాలు లేదా కీలక ఒప్పందాలు మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇంకా వెల్లడి కాలేదు. రెండు రాష్ట్రాలు తమతమ డిమాండ్లను కేంద్ర మంత్రి ముందుంచాయి. ఐతే.. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేయడంతో, ఈ అంశంపై తక్షణ నిర్ణయం తీసుకోబడలేదు. ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు, అంతర్-రాష్ట్ర సంప్రదింపులు, నిబంధనలకు అనుగుణంగా అన్ని అంశాలు పరిష్కరించబడే వరకు దీనిపై చర్చను వాయిదా వేయాలని తెలంగాణ కోరింది. ఈ భేటీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమన్వయకర్త పాత్ర పోషించారు. ఇరు రాష్ట్రాల వాదనలను విన్నారు. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read- YS Jagan: వైసీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు పరిస్థితి ఏంటి?
తదుపరి చర్యలు
ఇరు రాష్ట్రాల అభ్యంతరాలు, డిమాండ్లను పరిశీలించి, భవిష్యత్తులో పరిష్కార మార్గాలను అన్వేషించడానికి కేంద్రం ప్రయత్నిస్తుందని భావిస్తున్నారు. ఎపెక్స్ కౌన్సిల్ సమావేశాలు లేదా ఇతర ఉన్నత స్థాయి చర్చల ద్వారా ఈ వివాదాలను పరిష్కరించే అవకాశం ఉంది. ఈ సమావేశం ప్రధానంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై చర్చించడానికి ఒక వేదికగా నిలిచింది తప్ప, తక్షణమే ఏవైనా కీలక ఒప్పందాలు కుదరలేదు. తెలంగాణ బనకచర్ల ప్రాజెక్టుపై తన అభ్యంతరాన్ని గట్టిగా వినిపించగా, ఏపీ ఆ ప్రాజెక్టు ఆవశ్యకతను నొక్కి చెప్పింది. ఈ అంశంపై మరింత చర్చలు అవసరం.
అసలు పంచాయతీ ఇదీ..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు లేవని, చట్టాలు.. ట్రిబ్యునల్ తీర్పులను ఉల్లంఘిస్తుందని తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని, అజెండా నుంచి తొలగించాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ వాదించింది. ఈ క్రమంలోనే.. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వంటి కృష్ణా నదిపై పెండింగ్‌లో ఉన్న తమ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. దిండి, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని, ఇచ్చంపల్లి ప్రాజెక్టును కేంద్రమే చేపట్టాలని తెలంగాణ కోరింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు