Kishan Reddy: మేడిగడ్డ ప్రాజెక్ట్ క్రాక్ అయింది నిజం కాదా అని, అలాంటిది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏవిధంగా తప్పు అవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం కమిషన్ విచారణలో ఈటల రాజేందర్ కు తెలిసిందే చెప్పారన్నారు. కమిషన్ ఎదుట.., బయట ఈటల కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అవినీతికి పాల్పడిన మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామని చెప్పారని, ఇప్పటి వరకు ఎవరిపై చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు.
కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు జరగాలి
ఏడాదిన్నర అయినా ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు జరగాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబ అక్రమాలను ప్రశ్నించాడని, అందుకే ఈటల బయటికు వచ్చారన్నారు. కాళేశ్వరం అవినీతి, అక్రమాలు బయటికి రావాలంటే సీబీఐ దర్యాప్తు జరగాల్సిన అవసరముందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రూ.లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ ప్రజలకు ఎంత వరకు పనికొచ్చిందని నిలదీశారు. బంకచర్లపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
Also Read: Deputy CM Bhatti Vikramarka: 2030 నాటికి 20 వేల మెగావాట్ల.. గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం!
కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి
ఈవిషయంలో రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని కిషన్ రెడ్డి కోరారు. ఎందుకు బనకచర్లను నిలిపివేయాలనే అంశంపై పూర్తి వివరాలతో జలవనరుల శాఖను కలవాలని కేంద్ర మంత్రి సూచించారు. బనకచర్ల వల్ల తెలంగాణకు ఏవిధంగా నష్టం జరుగుతోందో డీటెయిల్డ్ గా లేఖ రాయాలని సూచించారు. గతవారం ఏపీ ప్రభుత్వం డీపీఆర్ ఇచ్చిందని, కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆ రిపోర్ట్ పరిశీలించలేదన్నారు. అధ్యయనం చేశాకే నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.
తెలంగాణకు అన్యాయం జరగవద్దు
ఈవిషయంలో ఏపీ సీఎం చంద్రబాబుని కంట్రోల్ చేయలేం కదా అంటూ పేర్కొన్నారు. గోదావరి జలాల పంపిణీ మేరకు తెలంగాణకు అన్యాయం జరగవద్దన్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు ఎలిజిబిలిటీ వచ్చిందని, త్వరలో అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా హైడ్రా ఎఫెక్టివ్ గా పనిచేయడం లేదని కేంద్ర మంత్రి విమర్శలు చేశారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈటల హాజరై ఆర్థిక మంత్రిగా ఏం జరిగిందో చెప్పారన్నారు. ఇదిలా ఉండగా తుమ్మల టీడీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేశారని, ఆయన ఆల్ పార్టీ మంత్రి అంటూ కిషన్ రెడ్డి ఎద్దేవాచేశారు.
Also Read: Young Man Dies: హనీమూన్‌కు వెళ్తున్న వేళ.. రైల్వే స్టేషన్‌లో విషాదం!