- రేవంత్ రెడ్డి కోసమో, కాంగ్రెస్ కోసమో మేము పని చేయం
- మెట్రో డీపీఆర్ గత వారమే కేంద్రానికి ఇచ్చారు
- సాధ్యాసాధ్యాలపై కేంద్రం పరిశీలన చేస్తోంది
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్
Kishan Reddy: తెలంగాణ ప్రజల కోసమే తాము పనిచేస్తామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసమో, కాంగ్రెస్ పార్టీ కోసమో తాము పనిచేయడంలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం మోతీనగర్‌లో ఆదివారం ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కిషన్ రెడ్డి వీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మెట్రో డీపీఆర్ గత వారమే కేంద్రానికి ఇచ్చారని, మెట్రో రైలు సాధ్యాసాధ్యాలపై కేంద్రం పరిశీలన చేస్తున్నదని స్పష్టంచేశారు. రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా పార్టీ సంస్థాగత ఎన్నికకు సంబంధించి సోమవారం నామినేషన్ల స్వీకరణ ఉంటుందని వెల్లడించారు. జూలై 1వ తేదీన అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో నేడు తెలంగాణకు సునీల్ బన్సల్, కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి శోభా కరంద్లాజే రాబోతున్నారని వెల్లడించారు. వారి సమక్షంలో నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. కాగా, అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ హామీలను కేంద్రం ఎలా అమలు చేస్తుంది
కేంద్ర మంత్రి అమిత్ షాకు స్వాగతం పలికేందుకు వెళ్లిన కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఇచ్చిన హామీని ఇప్పటికే అమలుచేస్తున్నామని, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను, కేంద్రంలోని బీజేపీ ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వారే అమలు చేయాలన్నారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయితే, బీజేపీ ఎలా అమలు చేస్తుందని చురకలంటించారు. పనికి రాని ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదని కిషన్ రెడ్డి వెల్లడించారు.
Read Also- ENE Repeat: కల్ట్ క్లాసిక్ చిత్రానికి సీక్వెల్.. అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
రైతుల పోరాటానికి ఫలితం
ఇందూరు రైతు మహా సమ్మేళన సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటుపై ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ రైతుల అనేక సంవత్సరాల పోరాటానికి ఫలితం లభించిందన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో పసుపు పంట సాగు జరుగుతున్నప్పటికీ, జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేయడం ఒక గొప్ప పరిణామమని వెల్లడించారు. యూపీఏ ప్రభుత్వం చేయలేకపోయిన పనిని మోదీ ప్రభుత్వం చేసి చూపించిందని కొనియాడారు. నిజామాబాద్ రైతులకు పసుపు బోర్డు కల్పించడం గొప్ప కానుక అని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసింది అని ప్రశ్నించే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను గమనించాలని చురకలంటించారు.
Read Also- Chandrababu: చంద్రబాబు అసహ్యించుకున్న ఆ 15 మంది ఎమ్మెల్యేలు ఎవరు?