MLC Nominations: పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఖాళీగా ఉన్న నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించడానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్‌లో భాగంగా ఆశావాహులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల గడువు నేటితో ముగిసింది. రేపు ఈ నామినేషన్ల పరిశీలన ప్రారంభమవుతుంది. 13వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి గడువు ఉన్నది. ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. వచ్చే నెల 5వ తేదీన ఓట్లు లెక్కింపు జరగనుంది.
పల్లా రాజేశ్వర్ రెడ్డి 2021లో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానానికి ఎమ్మెల్సీగా గెలిచారు. ఈ స్థానానికి 2027 మార్చి వరకు పదవీకాలం ఉన్నది. కానీ, ఆయన జనగామ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగి గెలిచారు. దీంతో డిసెంబర్ 9వ తేదీన ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానం ఖాళీ కావడంతో ఈసీ ఉపఎన్నిక నిర్వహించడానికి షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో వెంటవెంటనే ప్రధాన పార్టీలైనా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డిలు పోటీ చేస్తున్నారు.
Also Read: మాటలు.. మంటలు!.. చిక్కుల్లో ప్రధాని మోదీ
అభ్యర్థులను ప్రకటించడం, వారు నామినేషన్ వేయడం పూర్తి కావడంతో ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. ఉప ఎన్నిక జరిగే సెగ్మెంట్ పరిధిలో 12 జిల్లాలు ఉన్నాయి. ఇందులో చాలా చోట్లా అభ్యర్థులు తమ ప్రచారాన్ని పెంచారు. తీన్మార్ మల్లన్న ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పలు సంఘాల నుంచి ఆయనకు మద్దతు లభించింది. గతంలో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. అప్పుడు ఆయన స్వతంత్ర అభ్యర్థిగానే బరిలోకి దిగారు. ఈ సారి అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో ఉండటం గమనార్హం.