– ఎట్టకేలకు అంబానీ, అదానీలపై నోరు విప్పిన మోదీ
– ఓవైపు కాంగ్రెస్‌పై విమర్శలు
– ఇంకోవైపు ఇరకాటంలోకి మిత్రులు
– అంబానీ, అదానీల వద్ద నల్లధనం ఉందంటూ వ్యాఖ్యలు
– పెద్ద నోట్ల రద్దు వైఫల్యమని అంగీకరించినట్టేనా?
– వాళ్లిద్దరి దగ్గర బ్లాక్ మనీ ఉంటే దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయి?
– మోదీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నిలదీత
PM Modi: ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చేస్తున్న వ్యాఖ్యలు ఈమధ్య వివాదాలకు దారి తీస్తున్నాయి. ముస్లింలపై ఆయన చేసిన కామెంట్స్ రాజకీయంగా యుద్ధానికి దారి తీయగా, కాంగ్రెస్‌పైనా చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా కరీంనగర్ పర్యటనకు వచ్చిన మోదీ, కాంగ్రెస్‌పై విమర్శల దాడి చేయబోయి సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టు చర్చ జరుగుతున్నది. తన మిత్రులుగా ముద్రపడిని అంబానీ, అదానీలను ఇరుకునపెట్టడమే కాదు, బీజేపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుని అమలు చేసిన పెద్దనోట్ల రద్దు విఫలమైందని పరోక్షంగా అంగీకరించినట్టయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈడీ, సీబీఐ, ఐటీ ఏజెన్సీలను ఎందుకు రంగంలోకి దింపలేదని ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలను బట్టి కుర్చీ కదులుతున్నదని భయపడుతున్నారని తెలిసిపోతున్నదని కామెంట్లు చేస్తున్నారు.
బుధవారం వేములవాడకు వచ్చిన ప్రధాని, కాంగ్రెస్ నాయకులు పొద్దున లేస్తే అంబానీ, అదానీ అని జపించేవారని, ఈ ఎన్నికలు మొదలవ్వగానే ఎందుకు వారి పేర్లను మాట్లాడడం లేదని అడిగారు. వారిపై ఎందుకు ఆరోపణలు చేయడం లేదని ప్రశ్నించారు. అంబానీ, అదానీల నుంచి ఎంతమొత్తంలో డబ్బులు ముట్టాయని, ఎన్ని టెంపోల్లో నల్లధనం కాంగ్రెస్ గూటికి చేరిందని అడిగారు. అంబానీ, అదానీలతో ఏ చీకటి ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి.
Also Read: రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోదీ.. వీరి మధ్యే ఎన్నికలు
కాంగ్రెస్ నాయకులు వీటిని తిప్పికొట్టారు. రాహుల్ గాంధీ ఇప్పటికీ అంబానీ, అదానీల అక్రమాలను ఎండగడుతూనే ఉన్నారని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. మోదీ తన మిత్రులైన బడా పారిశ్రామికవేత్తలకు రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని, కానీ, పేద రైతుల రుణాల్లో ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని ఆగ్రహించారు. మోదీ తన మిత్రులు అంబానీ, అదానీల గురించి తలుపులు మూసే మాట్లాడుతారని, తొలిసారి బహిరంగంగా మాట్లాడటం చూస్తుంటే ఆయన భయపడుతున్నట్టు ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు. ఎంతటి కాలం వచ్చింది, తన మిత్రులపైనా దాడి చేసే పరిస్థితి మోదీకి దాపురించిందని ఖర్గే ట్వీట్ చేశారు. కుర్చీ కదులుతుందని మోదీకి అర్థమైందని, అందుకే ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు.
Also Read: కాంగ్రెస్‌లో చేరికల సందడి.. పార్టీలో చేరిన శ్రీకాంతాచారి తల్లి
మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌కు చెందిన అంబానీ, అదానీలతో ఆయనకు సత్సంబంధాలున్నాయని, వ్యాపారంలోనూ మోదీ వారికి సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆశ్రిత పెట్టుబడిదారులుగా వారు మరింత సంపన్నులయ్యారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. అలాంటి మిత్రులపై ఇప్పుడు మోదీ ఆరోపణలు చేయడం తారుమారైన పరిస్థితులను వెల్లడిస్తున్నదని చెబుతున్నారు. ఈ ఆరోపణలతో తన మిత్రులనూ ఇరకాటంలోకి నెట్టేశారని, వారి వద్ద నల్లధనం ఉన్నదని చెప్పకనే చెప్పేశారని అంటున్నారు. ఒక వేళ వారి వద్ద నల్లధనం ఉంటే మోదీ ప్రభుత్వం ఎందుకు ఈడీ, సీబీఐ, ఐటీ ఏజెన్సీలను రెయిడ్ కోసం పంపలేదని కేటీఆర్ సహా ప్రతిపక్ష నాయకులు నిలదీస్తున్నారు. ఇది మోదీ వైఫల్యమేనని, అవినీతి రహితం అని వారు చెప్పే మాటలు ఉత్త కబుర్లేనని విమర్శలు వస్తున్నాయి. నోట్ల రద్దు సమయంలో తప్పితే మళ్లీ ఆయన నల్లధనం మాట ఎత్తలేదు. ఇప్పుడు నల్లధనం ఉన్నదని ఆయన ప్రస్తావించడమంటే, బీజేపీ ప్రభుత్వం గతంలో చేపట్టిన నోట్ల రద్దు విఫలమైందని స్వయంగా అంగీకరించినట్టేనని ప్రత్యర్థి నాయకులు ఎత్తిచూపుతున్నారు.