CM Revanth Reddy: రాష్ట్ర వ్యాప్తంగా సీఎం విస్తృత పర్యటనలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రతీ రోజు రెండు సెగ్మెంట్ల చొప్పున సుడిగాలి పర్యటనలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్లాన్ చేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ నియోజకవర్గాలు తిరిగేలా తన షెడ్యూల్‌ను రూపొందించాలని పార్టీ నేతలకు సూచించినట్లు తెలిసింది. డిసెంబర్ 1 నుంచి వారం రోజుల పాటు షెడ్యూల్ ఫిక్స్ అయినట్లు తెలిసింది. అభివృద్ధి పనులపై ప్రచారంతో పాటు కొత్త వర్క్స్‌పై సీఎం క్లారిటీ ఇవ్వనున్నారు. ప్రచారంలో నిర్వహించే బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి ప్రస్తావించనున్నారు. ప్రతీ ఎన్నికలు తనకు ప్రతీష్టాత్మకమే అని ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన ముఖ్యమంత్రి.. తన యాక్షన్ ప్లాన్‌ను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ సీఎం టూర్ క్షేత్రస్థాయి లీడర్లు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపనున్నది. తమ విజయం ఖాయమని లోకల్ బాడీ ఎన్నికల ఆశావహులు ఫిక్స్ అవుతున్నారు.
అభివృద్ధే అజెండా.. ప్రజలే లక్ష్యం
రెండేళ్ల కాల వ్యవధిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని సీఎం ప్రజల ముందు ఉంచనున్నారు. దీంతో పాటు కొత్త వర్క్స్, కార్యక్రమాలను కూడా వివరించనున్నారు. సీఎం టూర్‌లో ప్రజలకు వివరించేందుకు అన్ని నియోజకవర్గాలు కలిపి దాదాపు లక్షా 8 వేల ప్రోగ్రామ్స్‌ను లిస్టు చేసినట్లు తెలిసింది. నియోజకవర్గాలు వారీగా సీఎం ప్రకటించనున్నారు. ఇందులో ఇప్పటి వరకు ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుతో పాటు కొత్త వర్క్స్ కూడా ఉన్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. అంతేగాక పెండింగ్‌లో ఉన్న పనులను పరుగులు పెట్టించడం, పూర్తయిన వాటిని ప్రజలకు అంకితం చేస్తారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకునే అవకాశం ఉన్నది.
Also Read: CM Revanth Reddy: అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు ఉండాలి: సీఎం కీలక వ్యాఖ్యలు
అసలు టార్గెట్.. ‘స్థానిక’ సమరం
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీఎం షెడ్యూల్ ప్రత్యర్థి పార్టీల్లోనూ కాస్త గందరగోళాన్ని సృష్టించనున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తమ గెలుపునకు కృషి చేసిన క్షేత్రస్థాయి లీడర్లు, నాయకుల కోసం కూడా తాను పనిచేస్తానని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించే బాధ్యత తనదేనంటూ సీఎం గతంలో హామీ ఇచ్చారు. దీంతోనే తన సుడిగాలి పర్యటనను ఫిక్స్ చేసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా గ్రామ, మండల స్థాయి నాయకులను, కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు కూడా ఈజీగా ఉంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. అంతేగాక ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఓటు బ్యాంకుగా మార్చుకోవడం, స్థానికంగా పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు వెలుసుబాటు ఉంటుందని నేతల్లో చర్చ జరుగుతుంది.

