Cabinet Bounties For Barangays : సార్వత్రిక ఎన్నికలకు ఏ నిమిషంలోనైనా నోటిఫికేషన్ రానుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి మండలి సమావేశం మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు మీడియాకు తెలిపారు.
పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, తొలిదశలో ఒక్కో నియోజక వర్గానికి 3500 చొప్పున రూ. 22,500 కోట్లతో మొత్తం 4,50,000 ఇళ్లు నిర్మించాలని, ఈ ఇళ్లకోసం గ్రామ సభల ద్వారా లబ్దిదారుల ఎంపిక జరగాలని మంత్రి మండలి నిర్ణయించింది. స్వయం సహాయ సంఘాలు తయారుచేసిన వస్తువుల బ్రాండింగ్ కోసం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 30 ఎకరాల స్థలం కేటాయించాలని కూడా కేబినెట్ తీర్మానించింది.
Read More: చిన్న పీట కాదు, పెద్ద శాఖలను చూడండి: భట్టి ఫైర్
గత ప్రభుత్వం భారీ నిధులు వెచ్చించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మీద విచారణ జరిపి నిజానిజాలను బయటపెట్టేందుకు పినాకినీ చంద్రఘోష్ అధ్యక్షతన కమిటీని నియమించాలని, 100 రోజుల్లో నివేదిక కోరాలని మంత్రివర్గం నిర్ణయించింది. రెండు రోజుల్లో 93 శాతం రైతు బంధు పథకానికి నిధులు విడుదల చేయాలని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లలో చోటుచేసుకున్న అక్రమాలను విచారించేందుకు జస్టిస్ నరసింహారెడ్డి అధ్యక్షతన ఒక విచారణ కమిటీ నియామకానికీ మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.
తెలంగాణలోని అర్హులైన వారందరికీ త్వరలో తెల్లరేషన్ కార్డులు ఇవ్వటం, యాదాద్రి పవర్ ప్లాంట్ వ్యవహారాల మీద విచారణకు కమిటీ ఏర్పాటు, తెలంగాణలోని ముదిరాజ్, యాదవ, మున్నూరుకాపు, లింగాయత్, పద్మశాలి, పెరిక, బలిజ,కురుమ తదితర బీసీ కులాలతో బాటు మాదిగ ఉపకులాలకు కార్పొరేషన్లు ఏర్పాటుకు మంత్రివర్గం ఓకే చెప్పింది.
Read More: ధరణి పేరుతో దిగమింగారు..!
2008 డిఎస్సీ అభ్యర్థులకు మినిమం టైం స్కేల్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలని, గీత కార్మికుల భద్రతకు తగు చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించింది. అలాగే వేసవిలో తెలంగాణ వ్యాప్తంగా నీటి ఎద్దడిని ఎదుర్కొనే అవకాశమున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలనీ నిర్ణయించారు. ఇక హైకోర్టు తీర్పు ప్రకారం కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను శాసన మండలికి సిఫారసు చేస్తూ ఒక తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించింది.