Descended in the name of Dharani : జమీందార్లు, భూస్వాముల నుంచి మిగులు భూములు లాక్కొని, వాటిని నిరుపేదలకు కాంగ్రెస్ పంచిన భూములను బీఆర్ఎస్ నేతలు ఇష్టారాజ్యంగా తమ పేర్ల మీద మళ్లించుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి ఆరోపించారు. ధరణి పేరుతో ఇందిరాగాంధీ కాలం నుంచి ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన భూములను సన్నిహితులకు, అనుయాయులకు అప్పగించారని ఆయన మండిపడ్డారు.
రాష్ట్ర సచివాలయం మీడియా సెంటర్‌లో ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి, సునీల్‌కుమార్ ధరణి స్పెషల్ డ్రైవ్ వివరాలను మీడియాతో పంచుకున్నారు. ధరణి పేరుతో ఉన్న పోర్టల్ నిర్వహణను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారనీ, దీంతో తెలంగాణలోని భూమి రికార్డులన్నీ ఆ సంస్థ, ఐటీ, రెవెన్యూ శాఖలోకి వెళ్లిపోయిందన్నారు. అనాదిగా తెలంగాణలో పటిష్టంగా ఉన్న భూ రికార్డుల వ్యవస్థను ధరణి పేరుతో నాశనం చేశారని వాపోయారు. 2017 తర్వాత పేదల పేరిట ఉన్న రికార్డులన్నీ బడా భూస్వాముల పేరుమీదికి మారాయనీ, బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ సన్నిహితుడి పేరు మీదికీ కొంత నిషేధిత భూమి బదిలీ అయిందని వివరించారు. సదరు గ్రామంలో భూములన్నీ నిషేధిత జాబితాలో ఉండగా, కేవలం ఆ ఒక్క వ్యక్తి భూమి మాత్రం అతడి పేరును ఎలా బదిలీ అయిందని కోదండరెడ్డి నిలదీశారు.
Read More: కాంగ్రెస్ ఖిల్లాలో గెలుపుకై వ్యూహాలు..!
ధరణి పేరుతో జరుగుతున్న అక్రమాలను విపక్షంలో ఉండగా నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతో కలసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం దాని గురించి ఎలాంటి చర్యా తీసుకోలేదని గుర్తు చేశారు. అందుకే అధికారంలోకి రాగానే పేదల పక్షాన నిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో పార్ట్-బీలో చేర్చిన 18 లక్షల ఎకరాల భూమి మీద పేదలకు హక్కు కల్పించే దిశగా అడుగులు వేస్తోందని వెల్లడించారు. భూ రికార్డులను గ్రామ స్థాయి నుంచి సీసీఎల్‌ఏ వరకు తిరిగి పునరుద్ధరించి, ఒక్క పేదవాడికీ నష్టం జరగకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ధరణి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం అమలుతో ఒక్కసారిగా భూయజమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని, ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న 2.46 లక్షల దరఖాస్తుల్లో లక్షకు పైగా పరిష్కారం జరిగిందనీ, ఇకపై పోర్టల్‌లో నమోదుకు తహసీల్దారులు, ఆర్డీవోలకు అధికారం ఇచ్చామని వివరించారు. మరోవైపు ఈ నెల 17 వరకు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని భూపరిపాలనా కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ డ్రైవ్ చివరి రోజులోపు ఎవరైనా నమోదు చేసుకోలేకపోతే కంగారు పడాల్సిన పనిలేదని, అర్హులైన వారు ఎప్పుడైనా వివరాలతో అధికారులను సంప్రదించొచ్చని భరోసా ఇచ్చారు.